Aug 17,2023 21:14

సంగమేశ్వరం శివపురం ఎత్తిపోతల పథకాలు

ఉ(ఎ)త్తిపోతలు
- నిరుపయోగంగా 'సంగమేశ్వరం, శివపురం' పథకాలు
- చెంతనే కృష్ణమ్మ.. ఎండుతున్న పంటలు
- నిర్లక్ష్యంలో అధికారులు, కమిటీ సభ్యులు
- నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు
ప్రజాశక్తి - కొత్తపల్లి

    గ్రామీణ ప్రాంతాల రైతుల బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలతో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశాయి. కొత్తపల్లి మండలంలోని ముసలమడుగు గ్రామ శివారులో అప్పటి ప్రభుత్వం శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. రైతులకు ఉపయోగపడకుండా నిరుపయోగంగానే ఉన్నాయి. చెంతనే కృష్ణమ్మ ఉన్నా రైతుల పొలాలు ఎండిపోతున్న పరిస్థితి మండలంలో నెలకొంది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నా ఆచరణంలో మాత్రం శూన్యం.
కొత్తపల్లి మండలం ముసలమడుగు గ్రామ శివారులో అప్పటి ప్రభుత్వం రూ.25.26 కోట్లతో శివపురం, రూ.36.49 కోట్ల నిధులతో సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల కింద 8500 ఎకరాలకు సాగునీరు అందించాలి. కొత్తపల్లి, శివపురం, గుమ్మడాపురం, ముసలమడుగు, ఎర్రమఠం, మాడుగుల గ్రామాల్లో ఉన్న రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. శివపురం ఎత్తిపోతల పథకం కింద 2405 మంది రైతులకు, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 3255 మంది రైతుల పొలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఎత్తిపోతల పథకాల సమీపంలోనే పుష్కలంగా కృష్ణమ్మ ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం, కమిటీ సభ్యుల నిర్వహణ సరిగ్గా లేక ఎత్తిపోతల పథకాల నుంచి ఇప్పటికీ సాగునీరు సక్రమంగా వదలడం లేదు. ప్రతి సంవత్సరం ఎత్తిపోతల పథకాల మోటార్లను రిపేరీల పేర్లతో రైతులకు సాగునీరు అందించకుండా కాలయాపన చేస్తున్నారు. గత సంవత్సరం శివపురం ఎత్తిపోతల పథకం మోటార్లను మరమ్మతులు చేసినప్పటికీ నేటికీ పొలాలకు సాగునీరు వదలలేదు. సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం మోటార్ల మరమ్మతుల కోసం కమిటీ సభ్యులు అందరూ కలిసి మరమ్మతులు చేయించాలని కొంత డబ్బు సమకూర్చినప్పటికీ ఖర్చు రెట్టింపు అవుతుండడంతో సాగునీరు వదలడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎత్తిపోతల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తులు ఉన్నప్పటికీ మోటార్లకు ఉన్న సామాగ్రి, కరెంటు తీగలను దొంగిలించుకుపోతున్న సంఘటనలు ఉన్నాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో మొక్కజొన్న, పత్తి పంటలకు సరైన సమయంలో నీరు లేక సుమారు 20 మంది రైతులు ట్రాక్టర్ల ద్వారా పంటలను చెడగొట్టారు. మిగతా గ్రామాల్లో కూడా చాలామంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

అధికారులు స్పందించి రైతులకు సాగునీరు ఇవ్వాలి
- రైతు సంఘం నాయకులు సంజీవ రాయుడు
శివపురం సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాల నుంచి సకాలంలో సాగునీరు అందించాలి. రైతుల పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఎత్తిపోతల పథకాల నుంచి ఆలస్యంగా సాగునీరు అందిస్తున్నారు. సరైన సమయంలో రైతులకు సాగునీరు ఇస్తే రైతుల పొలాలు సస్యశ్యామలం అవుతాయి. పంట ఎండిపోతున్న అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సకాలంలో రైతులకు సాగునీరు అందించాలి.
పంటలకు నీరు లేక చెడగొట్టాం
కౌలు రైతు గోపాల్‌, పెద్ద గుమ్మడాపురం.
గ్రామంలో కౌలుకు పొలం తీసుకొని మొక్కజొన్న పంట వర్షాలకు వేశాను. అయితే వర్షాలు రాకపోగా ఎత్తిపోతల నుంచి సాగునీరు వదలకపోవడంతో మొక్కజొన్న పంట ఎండిపోవడంతో పంట చెడగొట్టాను. ఈ ఏడాది 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ఎకరా రూ. 15 వేల చొప్పున 4 ఎకరాలకు రూ. 30 వేలు ముందుగానే చెల్లించాను. మొక్కజొన్న ఎకరాకు ఇప్పటికే రూ. 10 నుంచి రూ. 15 వేలు ఖర్చు చేశాం. 2 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంటను పూర్తిగా చెడగొట్టడంతో దాదాపు రూ. 70 వేల వరకు నష్టం వాటిల్లింది.