May 04,2023 11:03

హిందూపురం పట్టణం అంబేద్కర్‌ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు

            హిందూపురం : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనాగ్రహం వ్యక్తం అయ్యింది. బుధవారం నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సిపిఎం, సిఐటియు, వ్యకాసం, రైతు తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ప్రయివేటీకరణ చేస్తున్న కేంద్రం, దానిని అడ్డుకోకుండా మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలను పోలీసులు బలవంతంగా అణచివేసేందుకు ప్రయత్నించారు. మంగళవారం రాత్రి నుంచి ఎక్కడికకక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం పోలీసుల చేత నిరసనలను భగం చేయించే కుట్ర చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం విరమించుకునే వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరిస్తూ బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు రాస్తారోకో కార్యక్రమానికి పిలుపును ఇచ్చాయి. ఇందులో భాగంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు పట్టణంలోని ఇందిరా పార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్ముతామని అహంకారంతో ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కార్మిక చట్టాలను నీరుగార్చి లేబర్‌ కోడ్లుగా మార్చిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క శాతం వాటా కూడా విశాఖ స్టీల్‌ వాటాలు అమ్మడం చేతగాని ప్రభుత్వం ఒకేసారి వందశాతం వాటాలు అమ్మాలని కుట్ర చేస్తోందన్నారు. 'పోస్కో'తో జాయింట్‌ వెంచర్‌ పక్కనపెట్టి వ్యూహాత్మక అమ్మకాన్ని కేంద్రం ముందుకు తెచ్చిందన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజలందరూ గొంతుకలుపుతున్నారని చెప్పారు. నిరంకుశ పాలన సాగిస్తున్న బిజెపికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, అధ్యక్షులు జగదీష్‌, కోశాధికారి రామకష్ణ, మంజునాథ, ఆనంద్‌, చంద్ర, నరసింహమూర్తి, శంకర పాల్గొన్నారు.
రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో...
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వామపక్షాలు, కాంగ్రెస్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, రాస్తారో నిర్వహించారు. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నాడు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేసి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ పరీరక్షణ కోసం ఎంతటి ఉద్యమానికి అయిన సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్యామ్‌కిరణ్‌, బీఎస్పీ శ్రీరాములు, ఆర్‌సిపి శ్రీనివాసులు, ఎంఐఎం మున్నా, ఎంఎస్‌ఎప్‌ రవి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు హరిత, హిందూపురం మండల కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ హనుమంతరాయప్ప, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజి, కలీమ్‌, సైఫు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నాయకులు అమానూల్లా, యూనూస్‌, జమీల్‌, రామాంజినేయులు, అక్రమ్‌, గంగాధర్‌, ఆయాజ్‌, ముబారక్‌, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.