పుట్టపర్తి అర్బన్ : మండల, డివిజన్, జిల్లా అధికారులు పనిచేసే చోట.. ప్రధాన కార్యాలయాల ప్రాంతాల్లో కచ్చితంగా నివాసం ఉండాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. సోమవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై టెలీకాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్, పోలీస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఇతర అన్ని శాఖల అధికారులు ఒకే చోట నుంచి పాల్గొనాలన్నారు. వచ్చే సోమవారం నుంచి అందరూ ఒకే చోట కూర్చోవాలని, అక్కడే అందరూ అర్జీలను స్వీకరించాలన్నారు. ఉద్యోగులు అందరూ స్థానికంగానే ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రధాన కార్యాలయం నుంచి బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఉన్నతాధికారులతో అనుమతి తీసుకుని వెళ్లాలని సూచించారు. అనుమతి తీసుకోకుండా వెళ్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారులు, డివిజన్, మండల అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపిడిఒలు పనిచేసే చోట నివాసం ఉండడం వల్ల కిందిస్థాయి అధికారులు, సిబ్బంది కూడా స్థానికంగానే ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. అధికారులంతా స్థానికంగానే ఉండాలన్నారు. అధికారులు స్థానికంగా నివాసం ఉన్నారా.. లేదా..? అనే దానిపై ఆయా శాఖల అధికారులు తనకు నివేదిక అందజేయాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లా అధికారులు పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలు, ఆస్పత్రులను తనిఖీలు చేపట్టాలన్నారు. అక్కడ నెలకొన్న సమస్యలను తమకు తెలియజేయాలన్నారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, మండల తహశీల్దార్, ఎంపీడీవో, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకం ఈనెల 25 నాటికి పూర్తి కావాలన్నారు. కుటుంబ వైద్యుడు విధానం కింద సచివాలయాల్లో డాక్టర్ల ఫోన్ నెంబర్లు, పేర్లు ప్రదర్శించాలని సూచించారు. గడపగడపకు మన ప్రభుత్వం కింద గుర్తించిన పనులకు వెంటనే అనుమతులు తీసుకుని వాటిని సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించి నిజానిజాలు పరిశీలన చేసి నిజం ఏమిటో తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌ఒ కొండయ్య, సిపిఒ విజరు కుమార్, ఐసిడిఎస్ పీడీ లక్ష్మి కుమారి, ఇన్‌ఛార్జి డిఇఒ మీనాక్షి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ శివారెడ్డి, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డా||కష్ణారెడ్డితో పాటు తహశీల్దార్లు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.
స్పందన అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
వివిధ సమస్యల పరిష్కారంపై ప్రజలు స్పందనలో ఇచ్చే అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన గ్రీవెన్స్‌లో అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. స్పందన గ్రీవెన్స్‌లో రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా దష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో అర్జీలు రాసే సమయంలో, రిజిస్ట్రేషన్ల దగ్గర అర్జీదారుడికి ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలని, ఇందుకోసం ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్, డ్వామా పీడీ రామాంజనేయులు, పీఆర్ ఎస్‌ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ నరసయ్యతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










