May 30,2023 22:24

రిలేదీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, నాయకులు

పుట్టపర్తి రూరల్‌:ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని ఎపి జెఎసి అమరావతి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదురుగా మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షులతో పాటు కదిరి, బుక్కపట్నం తహశీల్దార్లు, రెవెన్యూ అసోసియేషన్‌ సెక్రటరీ నరసింహులు, మున్సిపల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు, ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి, రీజినల్‌ సివిపి.ఆర్‌ ఎస్‌ రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా తదితరులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనుద్దీన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ బాబా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చౌడప్ప , విఆర్‌ఎల సంఘం నాయకులు ఇతర ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
హిందూపురం :ఉద్యోగుల జీవితాలతో చెలగాట మాడితే ప్రభుత్వానికి పతనం తప్పదని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం హిందూపురం తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో ఎపిజిఇఎ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎఐటియుసి నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్మాయిల్‌, చలపతి, ఫక్రోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.