Sep 25,2023 20:57

వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న మీటర్‌ రీడర్స్‌

ప్రజాశక్తి-హాలహర్వి
రాష్ట్రంలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎపి విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ జిల్లా ఉపాధ్యక్షులు వేదవ్యాస ముని కోరారు. సోమవారం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వస్తే మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్‌ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్రలో హామీఇచ్చారని తెలిపారు. హామీ ఇచ్చి నాలుగేళ్లయిన మీటర్‌ రీడర్స్‌కు న్యాయం చేయకపోగా కక్ష సాధింపు చర్యలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. తమ సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. డివిజన్‌ కార్యదర్శి సద్దాం హుసేన్‌, మీటర్‌ రీడర్స్‌ పొన్నూరు సాబ్‌ పాల్గొన్నారు.