Oct 25,2023 12:54
  • పగిలిన తలలు..  చిందిన రక్తం
  • 80 మందికి గాయాలు, 11 మంది పరిస్థితి విషమం
  • చెట్టు కొమ్మ విరిగి ఒకరు, తొక్కుసలాటలో ఇద్దరు మృతి 
  • నిఘా నేత్రలో నేత్రలో నాట్యమాడిన కర్రలు
  • ఫలించని పోలీసుల వ్యూహం

ప్రజాశక్తి-హోళగుంద : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగుంద మండల పరిధిలోని నెరణికి తండా కొత్తపేట కొండ గుహలో వెలసిన దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వరల జైత్రయాత్ర(కర్రల సమరం) మంగళవారం అర్ధరాత్రి జరిగింది. జైత్ర యాత్రలో పాల్గొన్న వారిలో ముగ్గురు మృతి చెందగా, 80 మంది భక్తులకు, రింగ్ కర్రలు, అగ్ని దివిటీల ఆవిరి తగిలి బలమైన గాయాలయ్యాయి. అందులో 11మందికి బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆలూరు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన వైద్య కోసం తరలించగా చెట్టు కొమ్మ విరిగి ఆస్పరికి చెందిన గణేష్ (17)మృతి చెందారు. అదేవిధంగా బన్నీ ఉత్సవం తక్కుశలాటలో ఊపిరి ఆడక ఆలూరు మండలం ములగవెల్లి కొట్టాల చెందిన రామాంజనేయులు(42) బళ్లారికి చెందిన ప్రకాష్(28) మృతి చెందారు. వేలాది సంఖ్యలో పోలీసు బలగాలు ఉన్నప్పటికీ కర్రెలను దేవరగట్టుకు రాకుండా ఆపలేకపోయారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప నివారించడంలో విఫలమయ్యారని తాలూక ప్రజలు చర్చించుకుంటున్నారు.

  • మీడియాపై పోలీసుల ఆంక్షలు

దేవరగట్టులో స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్యశాలలో గాయాలపాలైన భక్తులు ఫోటోలు వీడియో కవరేజ్ కోసం వెళ్లిన మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించార, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏ మీడియా కూడా లోపలికి వెళ్ళకూడదు అంటూ పోలీసులు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు, గతంలో ఎప్పుడూ కూడా ఏ పోలీసు బాసులు కూడా ఇలాంటి నిబంధలను విధించలేదు. ఇలాంటి కొత్త ఆంక్షలు విధించడం  మీడియాకు సంకెళ్లు వేసినట్లు అవుతుందని విలేకరుల ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు.

  • దేవరగట్టులో కర్ణాటక మద్యం నాటుసారా

దేవరగట్టులో మంగళవారం జరిగిన కర్రెల సమరంలో కర్ణాటక మద్యం  ప్యాకెట్లు, నాటుసారా దర్శనమిచ్చాయి ఇంత మంది పోలీసులు ఉన్న కర్ణాటక మద్యం దేవర గట్ల ప్రత్యక్షమవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని పలువురు వాపోయారు. గత రెండు నెలలుగా ఎక్సైజ్ పోలీస్ అధికారులు దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కాస్తున్న నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన దేవరగట్టులో నాటుసారా ఏ రహదారుల చూసిన కనపడటం వెనక పోలీసుల పాత్ర ఉండే ఉంటుందని చర్చించుకున్నారు. శ్రీ మాల మల్లేశ్వర జైత్రయాత్రలో భక్తులు మద్యం సేవించి మైకంలో పాల్గొనడం ఇష్టానుసారంగా ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల అధిక సంఖ్యలో గాయాలు తగలడం జరుగుతుందని  పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారుల మధ్య అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకోవడం ప్రతి ఏడాది మామూలే, మద్యం సేవించి ఉత్సవంలో పాల్గొన్న భక్తులు కుటుంబాలు మాత్రం రోడ్డున పడుతున్నాయని భవిష్యత్తులో మద్యం అమ్మకాలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ప్రణాళికలతో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.

  • కర్రల సమరం కాదు.. ఉత్సవంలో పాల్గొనే సంప్రదాయం! : ఆలయ కమిటీ చైర్మన్ గుంటూరు శ్రీనివాసులు

దేవరగట్టు మాళ మల్లేశ్వర జైత్ర యాత్రలో పాల్గొన్న భక్తులు కర్రల సమరం కోసం తెచ్చుకోరని, సంప్రదాయం కోసం తెచ్చుకుంటారని దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుంటూరు శ్రీనివాసులు అన్నారు. తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయంగా భావించాలన్నారు. ఈ ఏడాది ఉత్సవం ప్రశాంతంగా జరిగిందని ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు గాయాలయ్యాయని ప్రాణ నష్టం ఏమి జరగలేదన్నారు.