యూరప్ : ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. కాలంతోపాటు అన్ని పనులు టెక్నాలజీతోనే పరుగులు తీస్తున్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా.. దానికి పరిమితులున్నాయి. ఆ పరిమితులను సైతం అధిగమించేలా టెక్నాలజీ దూసుకుపోతుంది. ఆ టెక్నాలజీ అద్భుత ప్రయోగమే డ్రోన్. డ్రోన్‌లు లేనప్పుడు మ్యాన్ పవర్‌తో నిఘా ఏర్పాటు చేసేవారు. అయినప్పటికీ ఆ నిఘా ఎంతో కష్టతరమయ్యేది. ఇప్పుడు సులభంగా డ్రోన్ సాయంతో జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వ్యక్తుల అనుమానిత కదలికలను పరిశీలిస్తున్నారు. అయితే డ్రోన్ సేవలు పరిమితం కావడంతో అనుమానిత కదలికలను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. దీన్ని అధిగమించేందుకు చెక్ రిపబ్లిక్ (యూరప్) సైంటిస్టులు.. మనిషి మేథస్సును డ్రోన్‌లకు బిగించాలనుకున్నారు. డ్రోన్‌లకు అచ్చు మనిషి మెదడు లాంటి వ్యవస్థను బిగించారు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం..! అచ్చు మనిషి ఎలా పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచిస్తాడో.. అలాగే ఈ డ్రోన్ కూడా ఆలోచిస్తుంది. అనుమానిత కదలికలను స్పష్టంగా కనిపెడుతుంది !
ఎలా చేశారంటే..
మనిషి మెదడులాంటి మెకానిజాన్ని (న్యూరాల్ నెట్‌వర్క్).. డ్రోన్‌లలో అమర్చారు. ఇది ఒక సర్వేలెన్స్ సిస్టమ్‌లాగా పని చేస్తుంది. ఏదైనా ఎదురైనప్పుడు మనిషిలాగే ఆలోచన చేసి పనితనాన్ని ప్రదర్శిస్తుంది. జనసాంద్రత ఉన్నప్పుడు వ్యక్తుల ముఖ కవళికలు, ప్రవర్తనను పసిగట్టి.. ఏది నార్మల్.. ఏది అబ్‌నార్మల్ అనేది డ్రోన్ నిర్ణయించుకుంటుంది.
అనలసిస్ చేయడమే కాదు.. సైంటిస్ట్‌ను అప్రమత్తం కూడా చేస్తుంది..
ఈ డ్రోన్ పరిస్థితులను గుర్తించడమే కాదు.. వెంటనే అబ్జర్వర్ (సైంటిస్ట్) ను అప్రమత్తం కూడా చేస్తుంది. దీని ప్రయోగదశలో ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్ల మీద ఈ 'బ్రెయిన్ డ్రోన్'లను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఆట జరుగుతుండగా మధ్యలో ఆటగాళ్లలో కొందరు అబద్ధం చెప్పారు. వెంటనే ఈ డ్రోన్ సిస్టమ్ పని చేయడం ప్రారంభించింది. ముందుగా ఫుటేజ్‌ను చిన్న కణాలుగా (భాగాలుగా) విభజించింది. ఆపై పిక్చర్ క్లియర్ తీసుకొని అక్కడ ఏం జరుగుతుందనేది అనలసిస్ చేసింది. ఆటగాళ్ల ముఖ కవళికలు, వాళ్ల ప్రవర్తన ఆధారంగా వాళ్లు అబద్దం ఆడారనే ఒక నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని డ్రోన్ సిస్టమ్ అబ్జర్వర్(సైంటిస్ట్)ను తెలిపి అప్రమత్తం చేసింది.
కొంత ప్రతికూలత..
బ్రోనో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చెక్ రిపబ్లిక్ పోలీస్ వ్యవస్థ సహకారంతో ఈ హ్యూమన్ బ్రెయిన్ న్యూరాల్ నెట్‌వర్క్‌ను రూపొందించారు. కేవలం జన సందోహం నడుమ నిఘాతో పాటు ట్రాఫిక్ మనేజ్‌మెంట్ కోసం కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ రియల్ టైం టెక్నాలజీ కీలక సమయాల్లో పని చేయడం మామూలు విషయం కాదన్నది సైంటిస్టుల మాట. అయితే జన సందోహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రోన్ సిస్టమ్ కొంత తడబడే ఛాన్స్ ఉంది. అందుకని సెన్సిటివ్ లెవల్‌ను ఏర్పాటు చేశాకే పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకొస్తామని బ్రోనో సైంటిస్ట్ డేవిడ్ బేజౌట్ తెలిపారు.










