Jun 08,2023 15:02

ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : కరెంట్ ఛార్జీల పెంపుపై వైకాపా నాయకులు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకుల డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి నందుకు నిరసనగా గురువారం స్థానిక  కోనేరు సెంటర్లో విద్యుత్ బిల్లులు తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా కరెంటు ఛార్జీలను 7 సార్లు పెంచారని, ప్రస్తుతం మరోసారి కరెంట్ బిల్లులను విపరీతంగా పెంచడం జరిగిందని, ఈ కరెంట్ ఛార్జీల పెంపుపై వైకాపా నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అనేక మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని, ఆయా ముఖ్యమంత్రుల 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచితేనే ఆ ముఖ్యమంత్రి ప్రతిపక్షాల ప్రశ్నలకు సిగ్గుపడేవారన్నారు. కాని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో 4 సంవత్సరాలకే 7 సార్లు అనేక రకాల పేర్లు చెప్పి కరెంట్ చార్జీలను పెంచారని, దానిపై ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించినా దున్నపోతుమీద వానపడిన చందంగా వైకాపా ప్రభుత్వ తీరుందన్నారు.  మున్సిపల్ ప్రతిపక్ష నేత మరకాని సమతా కీర్తిv మాట్లాడుతూ  2014కు ముందు కరెంట్ కొరతతో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన ముందుచూపు, ఆలోచన విధానాలతో కరెంట్ కొరతను తగ్గించడమే కాకుండా 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 24 గంటలు విద్యుత్ అందించారన్నారు.  రాష్ట్రంలో విద్యుత్ కు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ఆ వంకతో ప్రవేటు సంస్థలను నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, ఆ సంస్థలు కూడా జగన్, ఆయన బంధువుల కంపెనీలేనని అందువల్లే రూ.10కి కొనాల్సిన విద్యుత్ను రూ.20కు కొని ఆభారాన్నిరాష్ట్ర ప్రజలపైమోపుతున్నారన్నారు. నగర అధ్యక్షుడు ఎండి ఇలియాస్ పాషా  ప్రజల సొమ్మును జగన్ కుటుంబ సభ్యులు వందలాది కోట్లు దోచుకుంటున్నారన్నారు. ప్రభుత్వం పెంచుతున్న కరెంట్ చార్జీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కరెంట్ బిల్లులు కట్టకుండా ఉద్యమం చేద్దామంటే ఒక్కనెల కట్టకపోతే ఫీజులు పీకేస్తున్నారన్నారు. కరెంట్ నిత్యావసర వస్తువుల్లో ప్రధమ స్థానంలో ఉందని, అందువల్లే ప్రజలు కూడా ఆభారాన్ని దిగమింగుకుని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ దృతరాష్ట్ర పాలనను తరిమికొడదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ సొంత పత్రికను వాలెంటీర్లకు పంపుతున్నారని, దానికి ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులను సాక్షి పత్రిక ద్వారా దోచుకుంటున్నారని, ప్రజల సొమ్ము దోచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిగ్గుపడటం లేదన్నారు. పెంచిన కరెంట్ చార్జీలే రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయని, కరెంట్ చార్జీలు పెంచడం వైకాపా వారికి సహేతుకమేనా? అని ప్రశ్నించారు. ప్రతి చిన్నదానిపైన జగన్ బొమ్మను వేసుకుంటున్నట్లుగానే కరెంట్ చార్జీలపై కూడా జగన్ బొమ్మవేసుకోవాలని సూచించారు. కార్పోరేటర్ దేవరపల్లి అనిత  మాట్లాడుతూ  రానున్న రోజుల్లో స్మార్ట్ మీటర్లు పెట్టి మరోసారి ప్రజలను దోచుకునేందుకు జగన్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు, అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్, చలమల శెట్టి రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కాసాని భాగ్య రావు, పుప్పాల ప్రసాద్, పి.వి ఫణి కుమార్, బొడ్డు శ్రీను, సివకోటి రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ అజీమ్, ఊకంటి రాంబాబు, తిరుమాణి నారాయణ, గోకుల శివ, పడమట నాగరాజు, ఫిరోజ్, ఏసు, కట్ట దుర్గారావు, లంకి శెట్టి నీరజ, పాలపర్తి పద్మజ, కర్రెడ్ల సుశీల, లతీ ఫున్నీసా, ఎన్ వసంతకుమారి, రాగి చంద్రి, మారుతి,  తదితరులు పాల్గొన్నారు.