- భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనంపై టిడిపి, జనసేన నాయకులు
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : మచిలీపట్నంలో పట్టాభి స్మారక భవనం పనులు పాలకులు వెంటనే ప్రారంభించక పోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్, బూరగడ్డ వేదవ్యాస్, మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ అన్నారు. మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి పాలకులు సృష్టిస్తున్న అడ్డంకులకు నిరసనగా ఆదివారం జిల్లా పరిషత్ సెంటర్ లోని స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంస్య విగ్రహానికి బూరగడ్డ వేదవ్యాస్, బండి రామకృష్ణ లతోపాటుగా వివిధ పార్టీల నాయకులు, పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. పట్టాభి స్మారక భవనం నిర్మాణ పనులను పాలకులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విగ్రహం ఎదుట నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.అనంతరం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర బ్యాంకు మన మచిలీపట్నం కేంద్రంగా స్థాపించినటువంటి వ్యక్తి, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించినటువంటి మహానుభావుడు, కృష్ణా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ స్థాపించి రైతులకు ఎంతోమందికి ఉపయోగపడే విధంగా సేవలందిస్తున్న మహోన్నతమైన వ్యక్తి అయిన స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య విలువలకు మారుపేరైన మహనీయుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరు మీద మచిలీపట్నంలో నిర్మించే స్మారక భవనానికి పాలకులు అడ్డు తగలడం దురదృష్టకరం అన్నారు. యూనియన్ బ్యాంక్ వారు ముందుకు వచ్చి పట్టాభి స్మారక భవనం 40 కోట్ల రూపాయల పైబడినవిలువతో భవనం నిర్మిస్తామంటే పాలకులు అడ్డు తగలడం దురదృష్టకరం అన్నారు.
అంత సొమ్ము యూనియన్ బ్యాంకు వారు ఇచ్చి ముందుకు వస్తున్నప్పుడు స్థలం ఇచ్చి నిర్మాణ పనులను పాలకులు ప్రారంభించడానికి ఇబ్బంది ఏమిటని పాలకులను బూరగడ్డ వేదవ్యాస్ ప్రశ్నించారు. స్వతంత్ర సమరయోధుడికి గౌరవం ఇవ్వలేని వైసీపీ పాలకులు చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతారో అర్థం చేసుకోవాలన్నారు.జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ పట్టాభి స్మారక భవన నిర్మాణానికి అఖిలపక్షం, పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు పలుమార్లు జిల్లా కలెక్టర్ ను కలిసిన గత సంవత్సర కాలం నుండి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన కొత్త ప్రభుత్వం రాంగానే కచ్చితంగా మచిలీపట్నంలో పట్టాభి స్మారక భవన నిర్మాణాన్ని చేపట్టి తీరుతాము అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, కే చంద్రశేఖర్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు, గడ్డం రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గుమ్మడి విద్యాసాగర్, కాసాని భాగ్య రావు, బోలెం అయోధ్య రామయ్య, పట్టాభి స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు, వేమూరి రామకృష్ణారావు, పి ఎస్ ఎస్ ఆర్ శర్మ, పి.వి. ఫణి కుమార్, అయినంపూడి రాజశేఖర్, కే సుబ్బారావు, గూడూరు మండలం మాజీ జెడ్పిటిసి, బూరగడ్డ శ్రీ కుమార్, కాగిత చంటి, తదితరులు పాల్గొన్నారు.










