ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎన్నికల కమిషన్ విలువులను కూడా మంట గలిపారని మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు.బుధవారం నియోజక వర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నాకు ఓటు ఉందని ఏ ఒక్కరైనా గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా ప్రకటించగలరా చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైసీపీ రంగు పులుముకుందని ఆరోపించారు. మచిలీపట్నంలో ఓట్ల అవకతవకలకపై ఫిర్యాదు చేస్తే ఒక్క అధికారి కూడా స్పందించిన పాపాన పోలేదన్నారు. మేము ఫిర్యాదు చేస్తే మీకేంటి సంబంధం ఓటరు వచ్చి ఫిర్యాదు చేసుకుంటాడు కదా అని సమాధానం చెబుతారు తప్ప ఫిర్యాదు చేసిన దానిపై ఒక్కరంటే ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోలేదన్నారు.










