ప్రజాశక్తి-చల్లపల్లి : ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఎకరాకు రూ. 10 వేలు ఇచ్చి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు పూర్తిగా మునిగిపోయాయని వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతాంగాన్ని ఎకరాకు పది వేలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసిల్దార్ కే గోపాలకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయ రాధిక, టిడిపి మండల కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, ఎంపీటీసీ సభ్యులు మాలెంపాటి శ్రీనివాసరావు, పైడిపాముల స్వప్న, మాజీ వైస్ ఎంపీపీ బోలెం నాగమణి, కో ఆప్షన్ సభ్యులు షేక్ నభీ ఘోరి, పార్టీ నాయకులు నిడమానూరు దిలీప్ కుమార్, మోర్ల ప్రసాద్, తాతా ప్రదీప్, గోవాడ చంటి, మల్లంపల్లి శివరామకృష్ణ, రావి చిట్టి, కోట సత్యనారాయణ, మోర్ల శివ తదితరులు పాల్గొన్నారు.










