త్యాగానికి మారుపేరు షడ్రక్
- ఆయన జీవితం ప్రజా సేవకు అంకితం : సిపిఎం
- జిల్లా వ్యాప్తంగా వర్థంతి కార్యక్రమాలు
ప్రజాశక్తి - నంద్యాల
ఉమ్మడి కర్నూలు జిల్లా పార్టీ ఉద్యమంలో కామ్రేడ్ టి.షడ్రక్ సేవలు, చేసిన కృషి చాలా గొప్పదని, ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా ముందుండే గొప్ప వ్యక్తి అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్, సీనియన్ నాయకులు తోట మద్దులు పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ టి.షడ్రక్ 3వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షడ్రక్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్, సీనియర్ నాయకులు తోట మద్దులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షడ్రక్ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు అనేక భూ పోరాటాలలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజల కోసం కేసులను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారన్నారు. దళితుల సమస్యలపై కర్నూలు జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కమ్యూనిస్టు మహానుభావుడు కామ్రేడ్ షడ్రక్ అన్నారు. కర్నూల్ పేపర్ మిల్లులో ఉద్యోగం చేసుకుంటూ కార్మికుల సమస్యల మీద పోరాటం నిర్వహిస్తుండగా ఉద్యోగంలో నుంచి తీసివేసినా భయపడకుండా, వాళ్లతో లాలూచీ లేకుండా పోరాటం చేశారని తెలిపారు. అటువంటి వ్యక్తి 2020లో కరోనాతో జయించలేక మరణం పొందారన్నారు. ఆయన మనమధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. నంద్యాల అభివృద్ధి కావడానికి ఆయన పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు అనేక సలహాలు, సూచనలు ఇచ్చి ముందుకు నడిపించారని తెలిపారు. ఆయన ఆశయాలు ముందుకు వెళ్లాలంటే ప్రధానంగా యువకులు పార్టీలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.నాగరాజు, యేసురత్నం, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కెఎండి గౌస్, డి.లక్ష్మణ్, నాయకులు రామరాజు, బాల వెంకట్, చైన్‌సింగ్, హరి, కృష్ణ, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.










