Jun 28,2023 22:43

త్యాగాలకు ప్రతీక బక్రీద్‌

అనంతపురం, ఆత్మకూరు : త్యాగానికి ప్రతీకగా అయిన బక్రీద్‌ పండుగను ముస్లిములు గురువారం జరుపుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిములు బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఈద్గాలను ప్రార్థనల నిమిత్తం అన్ని వసతులతో సిద్ధం చేశారు. అనంతపురం నగరంతో పాటు గుత్తి, తాడిపత్రి, గుంతకల్లు, సత్యసాయి జిల్లాలో హిందూపురం, పెనుకొండ, కదిరి, ధర్మవరం పట్టణాల్లోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. పండుగను పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు ముస్లిములకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావంతో పండుగలను అందరూ కలసిమెలసి చేసుకోవాలని ఆకాంక్షించారు.
బక్రీద్‌కు ప్రత్యేకం ఖుర్బానీ
బక్రీద్‌ అంటే బకర్‌ ఈద్‌ అని అర్థం. బకర్‌ అంటే మూగజీవి.. ఈద్‌ అంటే పండుగ అని అర్థం. బక్రీద్‌ పండుగకు ఖుర్బానీని ప్రత్యేకంగా చెప్పవచ్చు. దీనికి ఓ కథ ప్రాచూర్యంలో ఉంది. తమ ప్రియమైన వస్తువులను త్యాగం చేయమని దేవుడు చెప్పినట్లు భావించి అబ్రహం(ఇబ్రహీం) తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలి చేసేందుకు సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాV్‌ా కుమారుని ప్రాణత్యాగానికి బదులు ఓ మూగ జీవాన్ని బలి ఇవ్వాలని చెబుతాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్‌ పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బలి ఇచ్చిన మూగజీవాలను మూడు భాగాలుగా చేసి.. అందులో ఓ వంతు పేద ప్రజలకు, రెండో వంతు తమ చుట్టాలకు, మూడో వంతు భాగాన్ని తమ కుటుంబం కోసం వాడుకుంటారు. అందుకే బక్రీద్‌ పండుగ రోజున ముస్లిలందరూ ఖుర్బానీ ఇస్తారు.