ప్రజాశక్తి - సీతానగరం : మండలంలో ఇకెవైసిని పూర్తి చేయాలని ఆర్‌డిఒ కె.హేమలత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మండలంలోని చిన్నభోగిలి, లక్ష్మీపురం, బుడ్డిడిపేటలో పర్యటించారు. సూపర్‌చెక్‌లో భాగంగా పంట బుక్ చేసిన సర్వే నెంబర్‌లో ఆ పంటలు ఉన్నాయా, లేదా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించి నిర్ధారించాలన్నారు. ఇదిలా ఉండగా మండల వ్యవసాయాధికారి ఎస్.అవినాష్ అన్ని గ్రామాల్లో పర్యటించి ఇకెవైసి ఇప్పటి వరకూ 82శాతం జరిగిందని, క్రాప్ బుకింగ్ కూడా 98శాతం జరిగిందని తెలిపారు.
బలిజిపేట : ఇ-క్రాప్‌లో భాగంగా బయోమెట్రిక్‌ను పలగరలో రైతుల బయోమెట్రిక్ నమోదును మండల వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వేసిన పంటకు ప్రతి రైతు బయోమెట్రిక్ వేసి ఆమోదించాలని, వారు వేసిన పంటను ఒకసారి చూసుకొని ఆధార్ బయోమెట్రిక్ వేయాలని అన్నారు. ఇంకా ఎవరైనా రైతులు వేసిన పంట ఇ- క్రాప్ చేయించుకోవడానికి ఈనెల 8 వరకు సమయం ఉందన్నారు. కావున ఇ-క్రాప్‌లో నమోదు కాకపోతే నమోదు చేసుకోవాలన్నారు. ఒకసారి రైతులు సాగుచేసిన పంట ఇ- క్రాప్ నందు నమోదైందో, లేదో ఆర్‌బికెలో తెలుసుకోవాలని తెలిపారు. ప్రస్తుతానికి 19500 ఎకరాలు గానూ 19050 ఎకరాలు నమోదైందన్నారు. 8856మంది రైతులకు గానూ 5862 మంది బయోమెట్రిక్ నమోదు చేసుకున్నారని, ఇంకా 2994 మంది రైతులు బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. కావున మిగతా రైతులు ఈనెల 8లోగా బయోమెట్రిక్ వేసుకొనేలా చర్యలు తీసుకోవాలని విఎఎను ఆదేశించారు.










