
ఏ కథలోనైనా విషయాన్ని సూటిగా, సాధ్యమైనంత తక్కువ పేజీల్లో చెప్పడం ముఖ్యం. దానికి శిల్పం, శైలి జత కుదిరితే... అన్ని పాళ్లు సరైన మోతాదులో కలిసిన చక్కని వంటకంలా కథ కూడా చక్కగా రూపొందుతుంది. అలాగే అన్నీ పాళ్లు సమ మోతాదులో కలిసిన కథలే శర్మ గారి 'కాలం చెప్పిన కథలు'. ఇందులో 28 కథలున్నాయి. ఈ కథలన్నీ దేనికవే భిన్నమైనవి... సామాన్యుడి చుట్టూ తిరిగే కథలు. అన్నిటికంటే చిన్న కథ 'దొడ్డ మనసు'. చిన్నపాటి వార్తలా అనిపించే ఈ కథలో.. కరోనా నేపథ్యంలో కూరలు అమ్ముకునే ఓ అవ్వ దొడ్డ మనసును తెలిపే పెద్ద సందేశాత్మక కథ. ఈ అవ్వ మాదిరిగానే ఈ కథలనిండా సామాన్యులే కనిపిస్తారు. మధ్యతరగతి మహిళలు, కొడుకుల ఆదరణకు నోచుకోక, సొంతింట్లోనే దిక్కులేనట్లు పడివుండే వృద్ధులు, కాలేజీల్లో జరిగే ర్యాగింగ్‌కు బలయ్యే అభాగ్యుల వ్యథలు, నోట్ల రద్దు సమయంలో అనేక అవస్థలు పడిన మధ్యతరగతి మనుషుల కథలు.. కాలంతోపాటు కదులుతూ మనలనూ అందులో పాత్రధారులను చేస్తాయి.
సామాజిక స్పృహ కలిగిన రచయితగా.. సమాజంలోని అనేక సమస్యలను ఈ కథల రూపంలో చర్చకు పెడతాడు రచయిత. అలాగే, ఒక ట్విస్టును కథ చివరివరకూ కొనసాగించడం చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన విద్య. అందులో శర్మగారు సిద్ధహస్తులనే చెప్పాలి. ఆషాఢమేఘం, మనీషానందలహరి వంటి కథల్లోని ట్విస్టు చివరివరకూ కొనసాగించి, చివరలో ఆశ్చర్యపరుస్తారు. 'ఏప్రిల్ ఫూల్' కథలో కూడా ఇలాంటి ట్విస్టే వుంటుంది. ఈ కథలోని ఆనందం అనే వ్యక్తి, తాను ఏప్రిల్ ఫూల్ అయ్యి, మిగతావారినందరినీ ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఏం చేశాడనేదే ఈ కథలోని ట్విస్ట్. సరదా సరదాగా సాగే 'మొగుడూ పెళ్లాల దొంగాట'లో రైల్లో ప్రయాణించేవారంతా ఎలా మోసపోయారన్నదే ఈ కథ. 'నరకం చూపిస్త యమ' కథ కూడా సరదా సరదాగా సాగుతుంది. యమలోకంలో కంటే భూలోకంలో శిక్షలే ఎక్కువ నరకాన్ని చూపుతాయని మానవ్ అంటే, ఆశ్చర్యపోయిన యముడు, చిత్రగుప్తుడు ఆ శిక్షలను తెలుసుకోవడానికి భూలోకానికి వస్తారు. రావడం రావడమే భారీగా కురిసిన వర్షంలో భాగ్యనగరం రోడ్లపై నడిస్తే, కాలక్షేపం కోసం తెలుగు సీరియల్స్ చూస్తే, కరెంటు పోయి, ఈగల మాదిరిగా వున్న దోమలు కుడుతుంటే.. అనుభవించే నరకం ఎలా వుంటుందో స్వయంగా రుచి చూస్తారు.
ఈ పుస్తకంలోని కథలన్నీ సరదాగా సాగుతూ, చివరలో ఒక ట్విస్ట్‌తో ముగుస్తాయి. మరీ ఉత్కంఠతను కలిగించేంత ట్విస్టులు లేకపోయినా...ఆహా అనిపిస్తాయి. చిన్న కథలే కాబట్టి.. అలవోకగా చదివేయొచ్చు. రచయిత పాత్రికేయుడు కావడం వల్లనేమో... కథల నిడివిలోనూ, వాక్యాల అమరికలోనూ పొదుపు పాటించారేమో అనిపిస్తుంది. రాసినవి కొద్దే అయినా ఆలోచింపజేసే విధంగా వుంటాయి ఈ కథలు.
- కాలం చెప్పిన కథలు - శర్మ సిహెచ్
పేజీలు : 100, వెల : 100/
సెల్ : 94405 87567
ప్రతులకు : సిహెచ్ విఎన్ఎస్ శర్మ
డోర్.నం.29-19-8/1
సుభ్రహ్మణ్య టవర్స్, డోర్నకల్ రోడ్డు
సూర్యారావుపేట, విజయవాడ-520002 (ఏ.పీ)
ఈ మెయిల్ : sarmach56@gmail.com
- రాజాబాబు కంచర్ల