ప్రజాశక్తి - హోళగుంద
స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో మంగళవారం ఎంపిపి నూర్జాన్‌బీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగింది. సమస్యలు మాత్రం పరిష్కారం కాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మండలంలో రోడ్ల సమస్యలు వెంటాడుతున్నా ఆర్‌అండ్‌బి అధికారులు ప్రతి సమావేశంలో 'ఇదిగో.. అదిగో' అంటూ కాలయాపన చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారులు రోడ్లు వేయడానికి ముందుకు రావడం లేదు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు వెనకడుగు వేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, వారి టెండర్‌ను రద్దు చేసి వేరే గుత్తేదారులకు రోడ్ల పనులు అప్పజెప్పడానికి ఉన్నతాధికారులు చర్చిస్తున్నారని ఆర్ అండ్ బి ఎఇ రవికాంత్ తెలిపారు. ప్రస్తుతం వర్షాల్లేక విద్యుత్ కోత విధిస్తున్నారని, తాగునీటి సమస్య ఏర్పడిందని ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని విద్యుత్ ఎఇ ఓబులమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ మనోహర్ తెలిపారు. సమావేశంలో చర్చించిన సమస్యలను మరో మూడు నెలల్లో జరిగే సర్వసభ్య సమావేశంలోపు పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులు అధికారులను కోరారు. ఎంపిడిఒ రాధా, అగ్రికల్చర్ ఆఫీసర్ ఆనంద్, హౌసింగ్ ఎఇ వర్మ, ప్రాథమిక వైద్య అధికారిని బిందు మాధవి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు










