తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ
- ఉపాధిలో అవినీతి అక్రమాలు
- ఆధారాలతో చూపినా స్పందించని పీడీ
- వ్యకాసం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొండను తవ్వి ఎలుక పట్టినట్లుగా సామాజిక తనిఖీ బృందం పని చేసిందని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరావు విమర్శించారు. సంఘం జిల్లా నాయకత్వం ఆధారాలతో చూపించినా ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.రామచంద్ర రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. గురువారం నంద్యాలలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా నాయకులు ఆర్.ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడు గ్రామంలో ఉపాధి హామీ సిబ్బంది, రాజకీయ నాయకులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆశావర్కర్స్ సుజాత జాబ్ కార్డు 801025 నెంబర్‌పై 9 వారాల పని చేసినట్లు దాదాపు రూ.10 వేలు, అంగన్వాడీ వెల్ఫేర్ ఆయా పార్వతమ్మ, వాలంటీర్ కవిత, కర్నూల్ సుబ్బారెడ్డి కాలేజీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థులు హైమావతి, బోయ పావని పేర్లతో బోగస్ మస్టర్లు వేసుకొని ఉపాధి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పారు. అలాగే ఎర్రమఠం గ్రామంలో 270 మంది ఉపాధి హామీ కూలీలతో 2 వారాలు పాటు వర్క్ శాంక్షన్ లేకున్నా పనులు చేయించి, బిల్లులు రాకుండా కూలీల కడుపులు కొట్టారని అన్నారు. ఎపిఒ, ఎంపిడిఒల దృష్టికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కూలీలు విషయం తీసుకెళ్లినా అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. కొత్తపల్లి మండలంలో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.7 కోట్లు పని జరిగితే అందులో 7 వేల రూపాయలు అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చి చెప్పారన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్తపల్లి మండలంలో సామాజిక తనిఖీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.రామచంద్ర రెడ్డి దృష్టికి సంఘం జిల్లా నాయకత్వం ఆధారాలతో తీసుకెళ్లి చూపించినా స్పందించకపోవడం దారుణమన్నారు. కొత్తపల్లె మండలంలో ఉపాధి హామీ పథకం జరిగిన అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేసి సంబంధిత బాధ్యులపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించడం, పనుల దగ్గర సౌకర్యాలు రద్దు చేయడం, ఉపాధి నిధులను ఇతర రంగాలకు మళ్ళించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధి పనుల దగ్గర కనీస సౌకర్యాలు లేక వడదెబ్బతో కూలీలు చనిపోతున్నారని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎన్.స్వాములు, యం.నరసింహనాయక్, ఎం.కర్ణ, శ్రీనివాసులు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వ్యకాసం జిల్లా అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు










