Oct 18,2023 00:41

మాట్లాడుతున్న టూరిజం కార్మికుల సంఘం నాయకులు

ప్రజాశక్తి-అరకులోయ:టూరిజం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈనెల 22లోపు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని కాంట్రాక్ట్‌, మాన్‌ పవర్‌, డైలీ వేజ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు డి. గంగరాజు, మంతల బాబురావు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌. ఆర్‌.వి.నరసింహ, వి,అంజలిరావు, ధర్మలు తేల్చి చెప్పరు. ఈ మేరకు అరకులోయ లోని గిరిజన సంఘం భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, టూరిజం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని వారు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 2010 నుంచి వివిధ రూపాల్లో అనేక ఆందోళనలు చేపడుతున్నా టూరిజం యాజమాన్యం కనీసం స్పందించలేదన్నారు. అప్పటి టూరిజం చైర్మన్‌ చందన ఖాన్‌ తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని వారు స్పష్టం చేశారు. గత ఏడాది అప్పటి రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుంభ రవిబాబు సమక్షంలో టూరిజం కార్మికులు ఆ శాఖ రాష్ట్ర యాజమాన్యంతో సమస్యలపై చర్చించినప్పటికీ ఇప్పటికి స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో సమ్మె తప్ప మరో మార్గం లేదని భావించి ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మెకు నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. 25 ఏళ్ల నుంచి కార్మికులందరూ చాలీచాలని వేతనంతోనే పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. పీజీలు చదివిన గిరిజన కార్మికులు సూపర్వైజర్‌ వంటి ప్రమోషన్లకు నోచుకోలేదన్నారు. టూరిజం కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, 2010లో టూరిజం కార్పొరేషన్‌ యాజమాన్యంతో చేసిన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, కార్మికులందరికి హెచ్‌ఆర్‌ పాలసీ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేసి విద్యా అర్హతను బట్టి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ కార్మికులకు పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.మృతి చెందిన కార్మికుల కుటుంబానికి అదే కేటగిరీలో తక్షణమే ఉద్యోగం కల్పించాలని, డైలీ వేస్‌ కార్మికులందరినీ ఆప్కస్‌లో కలపాలని, కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్మికులందరినీ గ్రాడ్యుటి అమలు చేయాలన్నారు. కార్మికులకు బస్సు పాస్‌, ఏజెన్సీ అలవెన్సులు, వాషింగ్‌ అలవెన్సులు పెంచాలని, యూనిఫామ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో అరకులోయ మయూరి, పున్నమి, అతిథి గృహాల కార్మికులు పాల్గొన్నారు.