అరకులోయరూరల్:గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, కొత్తవలస పారంలో కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా కార్మికులకు కనీస వేతనం ఎందుకు చెల్లించ లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు ప్రశించారు. ఐటీడీఏ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, హెచ్‌ఎంటీసీ కొత్తవలస ఫారం గేటు ముందు కార్మికులు డిమాండ్లు పరిష్కరించాలని మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి జన్ని భగత్‌రాం మాట్లాడుతూ, ఐటీడీఏలో పరిధిలో సుమారు 100 మంది పైగా కొన్ని ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, సెలవులు, పిఎఫ్, ఈఎస్‌ఐ వంటి కనీస సౌకర్యాలు నోచుకోలేదని తెలిపారు. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం ఇవ్వకుండా ఇంటికి పంపించడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. 2011-2012 సంవత్సరాల్లో పిఎఫ్ పేరుతో జీతాల్లో కోత విధించి పిఎఫ్ కట్టకుండా ఐటిడిఏ అధికారులు ఎగ్గొట్టారని తెలిపారు. సర్వీస్ ఉన్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కొత్తగా పనిలో చేరిన కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు రాంబాబు, వి.రాజు, గురువు, అప్పలరాజు, జగ్గారావు, పండు, తులసమ్మ పాల్గొన్నారు.
అరకులోయ:టూరిజం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈనెల 22 నుంచి సమ్మె నేపథ్యంలో సోమవారం అరకులోయ తహసిల్దార్‌కు సమ్మె నోటీస్ సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎన్నోమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. 22 సంవత్సరాలు అయినా ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర నాయకుడు గంగరాజు, బాబురావు, అంజల్‌రావు, నర్శింగ్, సంజీవరావు డిమాండ్ చేశారు.
సమ్మె నోటీసు అందజేస్తున్న టూరిజం కార్మికులు.
న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
అరకులోయ రూరల్: ఏపీ టూరిజం కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి టూరిజం వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియ(సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు మండల తహసిల్దార్ కు సమ్మె నోటీస్ అందజేశారు. అనంతరం సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా ఏపీ టూరిజం వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంతల అంజిలిరావు మాట్లాడుతూ, గత 20 సవత్సరాలుగా తాము టూరిజంలో పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతలేదని డిగ్రీలు, పీజీలు చదివిన తమకు ప్రమోషన్ కల్పించలేదన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు. ఇప్పుడు ఇస్తున్న జీతాలతో కుటుంబం జీవనం కష్టంగా ఉందని అన్నారు. ఎనిసార్లు టూరిజం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ్, ఒనాది, ధర్మ, మహేష్, కృప పాల్గొన్నారు.
బొర్రాలో కార్మికుల నిరసన
అనంతగిరి:ప్రభుత్వం ఇచ్చిన హామీను తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతూ పలు పర్యాటక శాఖలో పని చేస్తున్న కార్మికులు ఈనెల 22 తేదీ నుండి సమ్మె బాట చేపడుతున్న నేపథ్యంలో సోమవారం ప్రముఖ ప్రర్యాటక కేంద్రమైన బొర్రా గుహల వద్ద కార్మికులు మధ్యాహ్న భోజన సమయం విరమం అనంతరం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రతినిధి నర్సింగరాజు మాట్లాడుతూ, గతంలో తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కారం చేయాలని, లేకుంటే ఈనెల 22వ తేదీ నుండి యూనిట్లంతా మూసివేసి సమ్మె బాట చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పలు యూనిట్లలో పని చేస్తున్న కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోరాటంతోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సోమేస్, రామస్వామి, సింహాద్రి పాల్గొన్నారు.










