Oct 12,2023 23:56

టూరిజం అతిథి గహాల ముందు నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి -అనంతగిరి:పర్యాటకశాఖలో పని చేస్తున్న కార్మికులతో కుదుర్చుకున్న న్యాయపరమైన ఒప్పంద డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేయాలని, లేకుంటే ఈనెల 22వ తేదీ నుండి సమ్మె బాట తప్పదని అల్లూరి జిల్లా ప్రముఖ పర్యాటక పలు యూనిట్‌లలో పని చేస్తున్న కార్మిక యూనియన్లు విశాఖ జిల్లా రీజినల్‌ మేనేజర్‌, యూనిట్ల మేనేజర్లను కలిసి సమ్మె నోటీసులు సమర్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్న భోజన విరామం సమయం అనంతరం కార్మికులు నల్లబ్యాడ్జీలతో అనంతగిరి హరిత హిల్‌, టైడా, అరుకు, బొర్రా గుహలు, చింతపల్లి, లంబసింగ్‌, తదితర యూనిట్ల ముఖద్వారం వద్ద నిరసన చేపట్టి నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గతంలో తమ కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని, లేకుంటే ఈనెల 22వ తేదీ నుండి పర్యాటకశాఖ యూనిట్లు మూసివేసి సమ్మె బాట తప్పదని వారు స్పష్టం చేశారు. పర్యాటక శాఖను నమ్ముకుని ఏళ్ల తరబడి వెట్టిచాకిరి పనులు చేస్తూ చాలీ చాలని వేతనాలతో తమ కుటుంబ పోషణం చేస్తున్నామన్నారు. కాంట్రాకు,్ట అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మండల కార్మిక యూనియన్‌ ప్రతినిధులు నరసింహారాజు, సోమేస్‌, నగేష్‌, బుద్దురాజు డిమాండ్‌ చేశారుఉ. ఈ కార్యక్రమంలో అనంతగిరి, అరకు పలు మండలాల యూనిట్లలో పని చేస్తున్న కార్మికులు పాల్గొన్నారు
అరకు లోయ :అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న ఏపీ టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌లో వివిధ కేటగిరీలో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 22 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ఏపీ టూరిజం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, డైలీ వేస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు డి గంగరాజు, బాబురావు, అంజలి రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టూరిజం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గతంలో అనేకమార్లు టూరిజం యాజ మాన్యం, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌, అప్పటి ఎస్సీ, ఎస్టి కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి వారి సమక్షంలో విజయవాడ సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ నుంచి రివ్యూ మీటింగ్‌ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికి నేటికీ సంవత్సరాలు గడుస్తునా ఒక్క డిమాండ్‌ కూడా నెరవేర్చ లేదన్నారు. ఎన్నోసార్లు విజయవాడ హెడ్‌ ఆఫీస్‌ కు వెళ్లి విన్నపించినా యాజమాన్యం కనీసం స్పందన లేకపోవడంతో కార్మికులంతా ఈ నెల 22 నుంచి సమ్మెలోనికి వెళ్లడానికి నిర్ణయించు కున్నామన్నారు.ఇప్పటికైనా టూరిజం యాజమాన్యం కార్మికుల సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఇందులో భాగంగానే గురువారం టూరిజం అతిథి గృహాల ముందు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలియజేశారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.