ప్రజాశక్తి - నందవరం
తుంగతీరంలో ఇసుక దొంగలు పడ్డారు. ఇష్టమొచ్చినట్లు ఇసుకను తరలిస్తున్నారు. పోలీసులు, ప్రజలు ప్రశ్నిస్తే 'ఎమ్మెల్యే చెప్పార'ంటూ బుకాయిస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ఎమ్మెల్యే పేరు చెప్పి వైసిపి నాయకులు తుంగభద్ర నదిలోని ఇసుకను రవాణా చేస్తున్నారు. రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు.
నందవరం మండలం నదికైరవాడి, గంగవరం, పెద్దకొత్తిలి, చిన్నకొత్తిలి, నాగలదిన్నె, గురజాల, రాయచోటి గ్రామాల్లో అనధికార ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి, జెసిబితో ఇసుకను తోడేస్తున్నారు. తుంగభద్ర నది నుంచి ఒక్కో ట్రిప్ ఇసుకను తరలించాలంటే దూరాన్ని బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంతమంది అధికార వైసిపి నాయకుల అండతో ఇసుక మాఫియాగా మారి, రాత్రి వేళల్లో ఇసుకను తోడేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, జేబులు నింపుకుంటున్నారు. ఇసుక తరలింపును కింది స్థాయి అధికారులు అడ్డుకుంటే 'మాకు పెద్దాయన.. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి చెప్పారు. నువ్వు మమ్మల్ని అడిగేటంత పెద్ద వాడివా. మీ మండల అధికారులే మమ్మల్ని ఏమీ అనలేక పోతున్నారు. నువ్వెంత' అంటూ అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. అధికారులకు రాజకీయ ఒత్తిళ్లు రావడంతో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. దీనిని ఆదునుగా తీసుకున్న కొంతమంది అధికార పార్టీ నాయకులు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ట్రాక్టర్ల యజమానులతో కుమ్మక్కై రాత్రి పూట 10 ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని ఇసుక మాఫియాను నడుపుతున్నారు. ప్రభుత్వ పనులకు ఇసుకను తరలిస్తున్నామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ పనులకు ఇసుక కావాలంటే ఇసుక రీచ్ నుంచే తరలించాలి. రాత్రి పూట అనుమతి లేని గ్రామాల నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అందరికీ దొరుకుంతుందా అంటే అదీ లేది. కేవలం అధికార పార్టీ నాయకుల మనుషులకు, రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులకు మాత్రమే ఇసుక అందుబాటులో ఉంటోంది. జిల్లా పోలీసు, విజిలెన్స్ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు










