Jul 31,2023 20:44

పెచ్చులూడిన పాఠశాల పై కప్పు​​​​​​​

ప్రజాశక్తి - కోసిగి
నాలుగో తరగతి గదిలో 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలను వింటున్న సమయంలో హఠాత్తుగా పైకప్పు నుంచి సిమెంట్‌ పెచ్చులూడి కింద పడ్డాయి. ఉపాధ్యాయులు చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థులను గది నుంచి బయటకు తీసుకొచ్చారు. పైకప్పు పెచ్చులూడి కింద పడిన శబ్దానికి విద్యార్థులందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఇందులో ఇద్దరు విద్యార్థినుల తలకు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. కోసిగిలోని కుమ్మరివీధిలో ఉన్న జెఎంబి స్కూల్‌లో ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలతో పాఠశాల పైకప్పు పూర్తిగా తడిసి, సిమెంట్‌ పెచ్చులూడి కింద పడి ఉంటాయని నాలుగో తరగతి క్లాస్‌ టీచర్‌ సూర్య నారాయణ తెలిపారు. తమకు, తమ విద్యార్థులకు ఏమీ కాలేదని చెప్పారు. నాలుగో తరగతి చదువుతున్న టైసిన్‌ అనే విద్యార్థిని తలకు గాయాలు కాగా, హర్షిత అనే విద్యార్థిని చేతికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదురుగానే విద్యార్థులకు పాఠశాలలోనే ప్రథమ చికిత్స చేయించామన్నారు. సిమెంట్‌ పెచ్చులూడడంతో విద్యార్థులను పాఠశాల ఆవరణలోనే కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నామని తెలిపారు. తమ పాఠశాలలో 302 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఆరు గుదులు ఉండగా ఓ గదిలో పాఠశాలకు సంబంధించిన మెటీరియల్‌ ఉందని చెప్పారు. ఆ గదిని రేపు శుభ్రం చేయించి తరగతి గదులకు ఉపయోగించుకుంటామని తెలిపారు.