Jun 22,2023 19:52

cartoon

ట్రూఅప్‌ భారం రూ.163 కోట్లు
- సామాన్యులపై బాదుడు
- ఈ నెల నుంచి పెరిగిన బిల్లులు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ వినియోగదారులపై ప్రభుత్వం భారాన్ని మోపింది. గత 9 నెలలుగా ట్రూ అప్‌ (సర్దుబాటు) చార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.. దీనికి అదనంగా ఈ నెల నుంచి మరికొంత వసూలు చేస్తున్నారు. దీంతో ఈనెల నుంచి వచ్చిన విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగాయి...

     కేంద్ర ప్రభుత్వ సూచనలతో సామాన్యులపై ఇప్పటికే వివిధ రూపాల్లో భారాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ఈ నెల నుంచి మరింత భారాన్ని మోపింది. ఎపిఈఆర్‌సి నుంచి రెండో విడత సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు ఇప్పటికే అనుమతి వచ్చింది. దీంతో ఇప్పటికే వేస్తున్న విద్యుత్‌ భారానికి అదనంగా మరికొన్ని నెలల పాటు ట్రూఅప్‌ పేరుతో విద్యుత్‌ భారాన్ని మోపాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి డిస్కంకు వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలు చేశారు. 2021-22 ఏప్రిల్‌లో వాడిన యూనిట్లపై ట్రూ అప్‌ భారాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో కలిపారు. ఏ నెలకు సంబంధించిన బిల్లును ఆ నెల వసూలు చేయనున్నారు. అప్పట్లో అధికంగా విద్యుత్‌ వాడకం ఉంటే.. ప్రస్తుతం అందుకు సంబంధించిన భారం సామాన్యులపై పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లావ్యాప్తంగా 11 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ, వాణి, పారిశ్రామిక భారం వేశారు. నికరంగా 12.50 లక్షల మందిపై సుమారు రూ.163 కోట్ల మేర భారం పడింది. 2019 ఏప్రిల్‌ తర్వాత తీసుకున్న విద్యుత్‌ కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చారు. గతేడాది ఆగస్టు నుంచి తొలి విడత ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. 2014 నుంచి వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ట్రూ అప్‌ చార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు. కర్నూలు సర్కిల్‌లోని విద్యుత్‌ వినియోగదారుల నుంచి 38 నెలల పాటు వసూలు చేస్తున్నారు. గతంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్‌కూ 23 పైసలు లెక్క కట్టి బిల్లులో వేస్తున్నారు. ఇలా నాలుగు త్రైమాసికాల్లో నెలవారీగా వసూలు చేసేందుకు రంగం చేశారు. ప్రస్తుతం వస్తున్న బిల్లులో ఇప్పటికే వసూలు చేస్తున్న ట్రూఅప్‌ ఛార్జీలకు రెండో విడత ట్రూఅప్‌ ఛార్జీలను చేర్చి వసూలు చేశారు. దీంతో సామాన్యులకు ఈ నెల విద్యుత్‌ బిల్లులపై తీవ్ర భారం పడింది. గతంలో నెలకు రూ.150 నుంచి రూ.300 వచ్చే వారికి రూ.250 నుంచి రూ.600 వరకు విద్యుత్‌ బిల్లులు వచ్చాయి. రూ.400 నుంచి రూ.600 వచ్చే వారికి రూ.600 నుంచి రూ.800, రూ.600 నుంచి రూ.800 బిల్లు వచ్చే వారికి రూ.850 నుంచి రూ.1100 వరకూ ఈ నెల విద్యుత్‌ బిల్లులు వచ్చాయి.
అదనపు చార్జీలు వసూలిలా..
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు వాడుకున్న విద్యుత్‌ వినియోగాన్ని 18 ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా తీసి ట్రూ అప్‌ చార్జీలు యూనిట్‌కు అప్పట్లో వినియోగించిన యూనిట్‌కు ఏడు పైసల చొప్పున వసూలు చేస్తున్నారని విద్యుత్‌ శాఖ చెబుతోంది. 2021-2022 సంవత్సరంలో ఏప్రిల్‌, మే, జూన్‌లో వాడుకున్న వినియోగా నికి సంబంధించి అప్పట్లో వాడుకున్న వినియోగానికి యూని ట్‌కు 19 పైసలు చొప్పున, 2023 ఏప్రిల్‌లో వినియోగించుకు న్న వినియోగానికి యూనిట్‌కు 40 పైసలు చొప్పున ప్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజి కాస్ట్‌ అడ్జస్ట్‌మెంట్‌(ఎఫ్‌పీపీసీఏ) కింద అదనపు చార్జీలు జూన్‌లో వసూలు చేస్తున్నారు. ఇవి విద్యుత్‌ వినియోగదారుడికి అదనపు భారంగా మారింది.