Oct 09,2023 21:25

గిరిజన కళాకృతుల ప్రదర్శన మేళాను పరిశీలిస్తున్న జిసిసి ఎండి సురేష్‌కుమార్‌, ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి

సీతంపేట: గిరిజన ఉత్పత్తులకు ట్రైఫాడ్‌ ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించబడుతుందని జిసిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌కుమార్‌ అన్నారు. సోమవారం సీతంపేట ఐటిడిఎలో నిర్వహించిన గిరిజన కళాకృతుల ప్రదర్శన మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతంపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. సీతంపేటలో విడివికెలు చాలా బాగా పనిచేస్తున్నాయన్నారు. గిరిజన ఉత్పత్తులు కూడా చాలా బాగున్నాయన్నారు. సీతంపేట ప్రాంతంలో తయారయ్యే గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలో మంచి డిమాండ్‌ ఉందన్నారు. విడివికెలకు జిసిసి తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఐటిడిఎ పిఒ కల్పనకుమారి మాట్లాడుతూ విడివికె సభ్యులు భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా తయారవ్వాల న్నారు. మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తయారుచేసే గిరిజన ఉత్పత్తులు నాణ్యతతో ఉండాలన్నారు. ఐటిడిఎ నుంచి పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకొంటామని అన్నారు. ట్రైఫాడ్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ శాంకే మాట్లాడుతూ సీతంపేట గిరిజన ఉత్పత్తుల తయారీ విధానం బాగుందని, ఉత్పత్తులకు ప్యాకేజింగ్‌ చాలా బాగుందని అన్నారు. ట్రైఫాడ్‌ నుంచి మార్కెటింగ్‌ సౌకర్యం కలిగేలా అన్ని రకాల చర్యలు తీసుకొంటామన్నారు. దేశంలో అన్ని నగరాల్లో ఇటువంటి మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మేళాలో వివిధ పాఠశాలల నుంచి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలందర్నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐటిడిఎ ఎపిఒ రోసిరెడ్డి, జిసిసి డిఎం జి.సంధ్యారాణి, వెలుగు ఎపిడి రమణ, డిప్యుటీ డిఇఒ లిల్లీరాణి, జిసిసి మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, ఎఎంఒ పి.కోటిబాబు, సిఎంఒ చిరంజీవులు, జిసిడిఒ రాములమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.