ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : బందోబస్తు, బయట విధులను నిర్వ్తించే మహిళా పోలీసు సిబ్బంది సౌలభ్యం కొరకు దిశ మొబైల్ వాహనాలను మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య(నాని), జిల్లా ఎస్పీ పి జాషువా ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో సోమవారం రూ 6 కోట్లు బడ్జెటుతో ట్రాఫిక్ నిర్వహణ, రహదారి ప్రమాదాలు నివారణ కొరకు స్టాపర్ బోర్డ్స్, బ్రీత్ ఎనలైజర్లను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అందచేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు పేర్ని నాని మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను నివారించడం కోసం ప్రత్యేకంగా స్టాపర్ బోర్డులు, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నిలువరించడం కోసం బ్రీత్ అనలైజర్స్, మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా నియంత్రించేందుకు స్పీడ్ గన్స్, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించేందుకు ట్రాఫిక్ సిగల్ లైట్లు ఏర్పాటు జరిగిందనీ తెలిపారు. మహిళా సిబ్బంది సంక్షేమ దష్టిలో పెట్టుకొని దిశా మొబైల్ వాహనాలను ప్రారంభించటంసంతోషకరమైన అంశమని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 130 ట్రాఫిక్ స్టాపర్ బోర్డులను శాసనసభ్యులు చేతుల మీదుగా బందరు ట్రాఫిక్ పోలీసుకు అందించామన్నారు. ఈ స్టాపర్ బోర్డులు ట్రాఫిక్ నియంత్రణలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పారు.










