ప్రజాశక్తి - పార్వతీపురం : ఫీల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ లాండ్ రికార్డ్స్ అండ్ సర్వే (ఎఫ్.పి.ఓ.ఎల్.ఆర్)లో భాగంగా చేపడుతున్న ఆన్ లైన్ డేటా ఎంట్రీలో ఎటువంటి తప్పులు ఉండరాదని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు అన్నారు. పార్వతీపురం డివిజన్ తహశీల్దార్లు, హెచ్.డిటిలు, రీ సర్వే డిటిలు, మండల సర్వేయర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుకు శిక్షణా కార్యక్రమం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో మంగళ వారం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తప్పుగా డేటా ఎంట్రీ చేస్తే విఆర్‌ఒ నుంచి తహశీల్దార్ వరకు బాధ్యత వహిస్తారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తమ దష్టికి తీసుకురావాలని, వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రీ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తోందని, దాని ప్రాధాన్యతను గుర్తించి అంకిత భావంతో పనిచేయాలని ఆయన అన్నారు. తప్పులు లేని భూ రికార్డుల తయారీలో మన భాగస్వామ్యం ఉండటం గర్వకారణంగా భావించాలని ఆయన చెప్పారు. రీ సర్వేలో ఉన్న అన్ని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. రీ సర్వేలో జిల్లా ఆదర్శంగా నిలవాలని అందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ఆయన పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఆర్‌డిఒ కె.హేమలత పాల్గొన్నారు.










