Jul 20,2023 20:55

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్‌

ప్రజాశక్తి - ఆదోని
పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ఆయుధం లాంటిదని, అలాంటి ఓటరు జాబితాను తప్పులు తడకగా మార్చడం ఏమిటని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. గురువారం పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో రిటర్నింగ్‌ అధికారి అమర్‌నాథ్‌ రెడ్డి అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎలక్షన్‌ బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, ఎంపిడిఒ గీతావాణి హాజరయ్యారు. ఆదోని నియోజకవర్గంలో 2.54 లక్షల ఓట్లు ఉన్నాయని జాబితా అధికారులు తయారు చేశారని, ఇది ఎలా సాధ్యమని పలువురు పేర్కొన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ఒకే ఇంటి నెంబర్‌తో సుమారు 606 ఓట్లు ఉన్నాయని వెల్లడైన విషయం పత్రికల్లో బహిర్గతమైందన్నారు. ఇంత అశ్రద్ధగా జాబితా ఎలా తయారు చేస్తారని, ఇది ఎవరి ప్రయోజనాల కోసమని అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జీ దేవిశెట్టి ప్రకాష్‌ మాట్లాడుతూ... జాబితాలో భార్యభర్తల పేర్లు ఎక్కడెక్కడో ఉంటున్నాయని, దీనివల్ల చాలామంది ఓటుహక్కును వినియోగించుకోలేని దుస్థితి ఉందని తెలిపారు. టిడిపి కర్నూలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి మాట్లాడుతూ... ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్ల భాగస్వామ్యం ఉన్నట్లు తెలిస్తే మాత్రం తాము ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. సిపిఐ నాయకులు అజరు బాబు మాట్లాడుతూ... నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు మెప్పు కోసం తప్పులు చేయడం ఏమిటని నిలదీశారు. జనసేన నాయకులు తాహెర్‌ వలీ మాట్లాడుతూ... ఎవరి మెప్పు కోసమో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించ రాదన్నారు. ప్రాధాన్యత గల సమావేశానికి తహశీల్దార్‌ గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించారు. రిటర్నింగ్‌ అధికారి అమర్‌నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ... వచ్చేనెల 21 వరకు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి తనిఖీ చేసి తప్పులు లేని జాబితాను తయారు చేస్తారని, సహకరించాలని కోరారు. తప్పులు దొరినట్లు రుజువైతే బూత్‌ లెవెల్‌ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటీవలే బూత్‌ లెవెల్‌ అధికారులుగా బాధ్యతలు ఇచ్చారని, తప్పులకు తమను బాధ్యులను చేస్తే ఎలా అంటూ పలువురు సచివాలయ ఉద్యోగులు అభ్యంతర వ్యక్తం చేశారు. తమ శాఖకు సంబంధించిన పనులతోనే ఇప్పటికే సతమతమవుతున్నామని, అదనంగా బిఎల్‌ఒ బాధ్యతలు ఇచ్చి తమను బాధ్యులను చేయడం తగదని కోరారు.
తహశీల్దార్‌ గైర్హాజరు : ఎన్నికల ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా చూస్తామని కలెక్టర్‌ సృజన ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారి అమర్‌నాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశానికి ఆదోని తహశీల్దార్‌ వెంకటలక్ష్మి గైర్హాజరయ్యారు. రాజకీయ పార్టీల నాయకులు, విఆర్‌ఒలు హాజరైన సమావేశానికి తహశీల్దార్‌ గైర్హాజరు కావడం ఏమిటని నాయకులు మండిపడ్డారు. విధుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు. తహశీల్దార్‌ నిర్లక్ష్యం పట్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు రిటర్నింగ్‌ అధికారి అమర్‌నాథ్‌ రెడ్డిని కోరారు.