ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం గడసింగుపురంలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గడసింగుపురం గ్రామ సమీపంలో ఉన్న రాళ్లగెడ్డ వరద ప్రవాహం పొంగిపొర్లింది. దీంతో వీరఘట్టం - జియమ్మవలస ప్రధాన రహదారిపై పీకల్లోతు వరకు రాళ్ల గెడ్డ ప్రవహించింది. రాత్రివేళ వాహనదారులు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చీకట్లో గెడ్డ తీవ్రత తెలియకపోవడంతో రాత్రి 10 గంటల సమయంలో వీరఘట్టం నుంచి జియమ్మ వలస వెళ్తున్న కారు రోడ్డు దాటేందుకు ప్రయత్నంలో గెడ్డ ప్రవాహానికి కొట్టుకుపోయింది. అటుగా వస్తున్న గ్రామస్తులు గమనించి కారులో డ్రైవర్‌ను రక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ జియ్యమ్మవలసకు చెందిన దాసరి స్వామినాయుడు గా గుర్తించారు. కారును జెసిబి సాయంతో బయటకు తీశారు.
పదేళ్లుగా ఇదే సమస్య
వర్షాకాలం వచ్చిందంటే చాలు గత పదేళ్ల నుంచి ఇదే సమస్య ఉందని సిపిఎం మండల కార్యదర్శి కోరంగి సీతారాం తెలిపారు. రాళ్ల గెడ్డ వద్ద కల్వర్టు నిర్మించాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా స్పందించలేదని అన్నారు. ప్రధాన రహదారి వద్ద లోతు ప్రాంతం ఉండడంతో భారీ వర్షాలకు వరద నీరు పొంగి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాళ్లగెడ్డ వద్ద కల్వర్టు నిర్మించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.










