ప్రజాశక్తి - సాలూరు : మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మధ్య తోపులాట, వాదులాట జరిగింది. వైసిపి పాలకవర్గం పగ్గాలు చేపట్టి రెండున్నర ఏళ్ళు దాటిపోయాయి. మొదటిసారిగా టిడిపి కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో నిరసన గళం వినిపించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పోడియం ముందు బైఠాయించి సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో అజెండా లోని అంశాలపై చర్చ మొదలైంది. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం తోపాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఇడి దీపాలతో అలంకరించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు నామినేషన్ పద్ధతిలో ఈ పనిని వైభవ్ శ్రీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ కి అప్పగించడంపై టిడిపి కౌన్సిలర్లు టి.లక్ష్మోజీ, వి.హర్షవర్ధన్, కె.వరలక్ష్మీ, వైదేహి కృష్ణ, బి.సీతమ్మ ప్రశ్నించారు. చైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ కుమారుడు పిపిఎస్ భరత్ కుమార్ యజమానిగా ఉన్న వైభవ్‌శ్రీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ కి నామినేషన్ పద్ధతిలో వర్క్ ఇవ్వొచ్చు నా అని టిడిపి సభ్యులు ప్రశ్నించగా ఇవ్వొచ్చునని ఎఇ సూరినాయుడు చెప్పారు. లక్ష రూపాయల అంచనా వేశామని, ఎంత పని జరిగితే అంతే బిల్లు చేస్తామని ఎఇ బదులిచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణకు, వైద్య శిబిరాలు ఏర్పాటు కు ఖర్చు కోసం లక్ష రూపాయల అంచనాతో పెట్టిన అంశాన్ని టిడిపి కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు చేస్తుంది కదా అని టిడిపి సభ్యులు ప్రశ్నించగా మున్సిపల్ కమిషనర్ జయరాం మాట్లాడుతూ పట్టణంలో నిర్వహణ బాధ్యతలను మున్సిపాలిటీయే చేపడుతుందని చెప్పారు. కార్యక్రమం నిర్వహణకు ముందు మున్సిపాలిటీ ఖర్చు చేస్తుందని, ప్రభుత్వం తర్వాత ఆ నిధులు విడుదల చేస్తుందని కమిషనర్ చెప్పారు. దీనిపై తాము డిసెంట్ తెలియజేస్తున్నామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి నిధులు లేవని చెపుతున్న అధికారులు ఇలాంటి కార్యక్రమాల కోసం సాధారణ నిధి ఎలా ఖర్చు చేస్తారని టిడిపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. అనంతరం చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మకి డిసెంట్ పత్రం అందజేశారు. ఆ తర్వాత చైర్ పర్సన్ ముందున్న పోడియం వద్ద బైఠాయించి సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆ వెంటనే వైసిపి కౌన్సిలర్లు, చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో కొంత సేపు గందరగోళం నెలకొంది. సమావేశంలో నినాదాలు చేయడం సరైనది కాదని చైర్ పర్సన్ ప్రతిపక్ష సభ్యులకు వారించారు. దీంతో వైసిపి, టిడిపి కౌన్సిలర్ల మధ్య వాదులాటకు దారితీసింది. ఆ తర్వాత టిడిపి కౌన్సిలర్లు బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత వైసిపి కౌన్సిలర్లు సమావేశం ప్రారంభించారు. పట్టణంలో 16వార్డులో ఒక భవన నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం లంచం ఇచ్చి కమిషనర్ శంకరరావును ఎసిబికి పట్టించిన కాంట్రాక్టరు అదే భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారని వార్డు కౌన్సిలర్ రాపాక మాధవరావు ప్రశ్నించారు. ఆ భవనం నిర్మాణానికి సంబంధించి అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ దానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.










