ప్రజాశక్తి-పార్వతీపురం : జిల్లాలో తొలగించిన ప్రతి ఓటునూ పరిశీలిస్తున్నామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు పునశ్చరణ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తొలగించిన ప్రతి ఓటు పరిశీలించుటకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో ఇంటింటి ఓటరు విచారణ 0.48 శాతం మాత్రమే పెండింగ్ ఉందన్నారు. పాలకొండ నియోజకవర్గంలో 1,99,111 ఓటర్లు ఉండగా 926 మందిని, కురుపాం నియోజకవర్గంలో 1,87,120 ఓటర్లు ఉండగా, 518 మందిని, పార్వతీపురం నియోజకవర్గంలో 1,87,815 ఓటర్లు ఉండగా 69 మందిని పరిశీలించాల్సి ఉందని తెలిపారు. సాలూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,99,295 ఓటర్లు ఉండగా 2164 మందిని పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
ఇంటింటి విచారణలో 4622 మంది లేనట్లు గుర్తించామన్నారు. ఇందులో పాలకొండ నియోజకవర్గంలో 1747 మంది, కురుపాం నియోజకవర్గంలో 446 మంది, పార్వతీపురం నియోజకవర్గంలో 1131 మంది, సాలూరు నియోజకవర్గంలో 1298 మంది ఉన్నారని ఆయన చెప్పారు. 3213 మంది శాశ్వతంగా ఆయా గ్రామాల నుండి వెళ్లిపోయిన ఓటర్లను గుర్తించామన్నారు. అందులో పాలకొండ నియోజకవర్గంలో 1722 మంది, కురుపాం నియోజకవర్గంలో 244 మంది, పార్వతీపురం నియోజకవర్గంలో 836 మంది, సాలూరు నియోజకవర్గంలో 411 మంది ఉన్నారని వివరించారు. 13,998 మంది ఓటర్లు మృతి చెందినట్లు గుర్తించామన్నారు. 1862 నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అందులో పాలకొండ నియోజకవర్గంలో 1051 మంది, కురుపాం నియోజకవర్గంలో 194 మంది, పార్వతీపురం నియోజకవర్గంలో 322 మంది, సాలూరు నియోజకవర్గంలో 295 మంది ఉన్నారని వెల్లడించారు. 23,826 ఓటర్లకు చేర్పులు, మార్పులు చేసినట్లు తెలిపారు.
ఓటరు జాబితాలో తప్పులు గమనిస్తే దరఖాస్తు చేయవచ్చని, ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, బిజెపి ప్రతినిధి పారిశర్ల అప్పారావు, టిడిపి ప్రతినిధి బి.డి.చంద్రమౌళి , వైసిపి ప్రతినిధి బి.శ్రీనివాసరావు, జనసేన పార్టీ ప్రతినిధి పైల శ్రీనివాసరావు పాల్గొన్నారు.










