ప్రజాశక్తి - ఆదోని
టమోటా కోసం తిప్పలు తప్పడం లేదు. బజార్‌లో నాణ్యతను బట్టి కిలో రూ.200 వరకు టమోటా ధర ఉంది. రాయితీతో ప్రభుత్వం కిలో రూ.50లకే ఇస్తామని ప్రకటించడంతో పనులు వదులుకొని టమోటా కోసం ప్రజలు పడుతున్న తిప్పలు వర్ణానతీతం. రాయితీ టమోటా కోసం వినియోగదారులతో రైతు బజార్ కిక్కిరిసింది. 20 రోజుల తర్వాత గురువారం రైతు బజార్‌కు రెండు టన్నుల టమోటాను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి రాయితీపై వినియోగదారులకు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఉదయం రావాల్సిన టమోటాలు 11 గంటలకు రావడంతో ఆధార్ కార్డులు చేత పట్టకుని లైన్‌లో నిలుచుని ఉండాల్సిన పరిస్థితి. టమోటా ధరలు కిలో మార్కెట్‌లో రూ.160లకు పైగా పలుకుతుండడంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. రైతు బజార్‌లో కిలో రాయితీ కింద రూ.50 ఇస్తుండడంతో మహిళలు భారీగా తరలివచ్చారు. కొంతమంది సంకలో చంటి బిడ్డలతో టమోటా కోసం బారులు తీరారు. టమోటా కోసం రైతు బజార్‌కు భారీగా జనం రావడంతో సిబ్బందికి అదుపు చేయడం కష్టంగా మారింది. ఒకరిపై ఒకరు తోపులాడుకున్నారు. కొందరు వాగ్వాదం చేసుకున్నారు. వెంటనే ఎస్టేట్ అధికారి అశోక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు జనాలను అదుపు చేశారు. మూడు గంటల్లో రెండు టన్నుల టమోటాలను 2 వేల మందికి పంపిణీ చేశామని ఎస్టేట్ అధికారి తెలిపారు.
అవసరం మేరకు తెప్పిస్తాం
- మజర్ అహ్మద్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్
టమోటా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన మేరకు దిగుమతి చేయిస్తాం. రెండు టన్నుల టమోటాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఒక టన్ను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. త్వరలోనే టమోటాలు వస్తాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు.
టమోటా కోసం కిక్కిరిసిన జనం










