ప్రజాశక్తి - బెలగాం: ఏనుగుల బాధలు ఇంకెన్నాళ్లని, తక్షణమే ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా అటవీశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సోమవారం కొమరాడ మండలం అర్తాం వద్ద ఏనుగు బస్సుపై చేసిన దాడిలో జరగకూడని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు 11 మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకొని, 35 మూగ జీవాలను చంపేశాయన్నారు. దాదాపు రూ.3కోట్లు కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. గత నాలుగైదు ఏళ్లుగా కురుపాం, పార్వతీపురం, పాలకొండ తదితర నియోజకవర్గాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏనుగుల సమస్యల పరిష్కారంలో పాలకులకు, అధికారులకు కనీసం చిత్తశుద్ధి లేదన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఎంత మందిని చంపే వరకు చూస్తారన్నారు. తక్షణమే ఏనుగుల తరలింపుకు తదితరులు చేపట్టాలన్నారు. అలాగే బాధితులకు నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అటవీశాఖ రేంజ్ అధికారి కె.మణికంఠష్‌కు వినతిని అందజేశారు. దీనికి ఆయన స్పందిస్తూ ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు, ఐద్వా, పట్టణ పౌరు సంక్షేమ సంఘ నాయకులు వి.ఇందిర, రెడ్డి శ్రీదేవి, గొర్లి వెంకటరమణ, పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, సంచాన ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కర్రి మణికంఠ, తామరకండి తేజ, గుంట్రెడ్డి గౌరీ శంకర్, అంబటి బలరాం, తిరుమలరెడ్డి కనకరాజు, అయ్యర్ల సంఘ నాయకులు పి.సంగం, బిజెపి నాయకులు సొండి సంజీవి, పళ్లెం కనకారావు, రొంపిల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.










