Oct 18,2023 22:11

తిరుపతిలో 'దసరా' తిప్పలు

తిరుపతిలో 'దసరా' తిప్పలు

ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్‌
ప్రత్యామ్నాయాలు పట్టించుకోని ఆర్టీసీ
సొంతూళ్లకు వెళ్లేందుకు అవస్థలు
నేడు గరుడసేవతో మరింత ఇబ్బంది
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
ఏపీఎస్‌ఆర్టీసీ తిరుపతి సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్టాండ్‌ ప్రాంగణం మొత్తం ఇసుకేస్తే రాలనంత మంది జనం. ప్రయాణికులతో బస్టాండ్‌ మొత్తం ఫుల్‌ అయ్యింది. ఓ వైపు దసరా సెలవులు... మరోవైపు గురువారం శ్రీవారి గరుడసేవ. ఆర్టీసీకి ముందు చూపు లేకపోవడంతో ప్రయాణికుల తిప్పలు వర్ణనాతీతం. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి.
తిరుపతి ఆధ్యాత్మిక నగరమే కాదు. విద్య, వైద్య హబ్‌లుగానూ ప్రఖ్యాతిగాంచింది. ప్రముఖ యాత్రాస్థలంగానూ, వ్యాపార రంగంలోనూ ముందుకెళుతోంది. ఇంత ప్రాముఖ్యత గల తిరుపతికి ప్రతిరోజూ లక్ష మందిపైనే భక్తులు వచ్చి వెళుతుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందనడంలో సందేహం లేదు. పైగా గురువారం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరగనుంది. గరుడ సేవను వీక్షించేందుకు మూడు లక్షల వరకు జనాలు వస్తారని టీటీడీ, ఆర్టీసీ అధికారుల అంచనా. వచ్చే భక్తులకు తిరుపతి తిరుమల మధ్య రవాణా సౌకర్యాలు కల్పించే దానిపైనే అధికారులు దష్టి పెట్టారు. పైగా బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు బయట ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలను సైతం తిరుమలకు నిలిపివేశారు, ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు. దీంతో తిరుమలలో విధులు నిర్వహించేందుకు వెళ్లే ఉద్యోగులు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి. చుట్టుపక్కల డిపోల నుంచి, పక్క జిల్లాల నుంచి బస్సులు రప్పించి తిరుపతి తిరుమల మధ్య సర్వీసులు నడుపుతున్నారు. అటు టీటీడీ అధికారులు ఇటు ఆర్టీసీ అధికారులు తిరుమల శ్రీవారి బ్రహ్మౌత్సవాల పైన దష్టి పెట్టారు కానీ, దసరా సెలవులను విస్మరించినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పాఠశాలలకు, జూనియర్‌ కళాశాలకు దసరా సెలవులు ఇచ్చారు. 18వ తేదీ నుంచి డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాలకు సైతం దసరా సెలవులు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు దసరా సెలవులు ప్రకటించడంతో హాస్టల్‌ విద్యార్థులు, వర్కింగ్‌ హాస్టల్స్‌ లో ఉండే చిరు ఉద్యోగులు, తదితరులు వాళ్ల సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌కు చేరుకున్న వారికి ఆయా ఊర్లకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడం నిరాశకు గురి చేసింది. అనంతపురం, కదిరి, మదనపల్లి, బి కొత్తకోట, కడప, పులివెందుల, పుంగునూరు, పెనుగొండ, పుట్టపర్తి వంటి ప్రాంతాల్తో పాటు, ఆఖరికి చిత్తూరుకు వెళ్లేందుకు కూడా ప్రయాణికులకు తీవ్ర అవస్థలు పడ్డారు. సుమారు ఐదు ఆరు గంటలు వేచి ఉన్నా బస్సులు రాలేదు. అరకొర బస్సులు వచ్చినా అవి రిజర్వేషన్‌ కే పరిమితం కావడంతో ఏం చేయాలో ప్రయాణికులకు దిక్కుతోచలేదు. కనిపించిన ప్రతి బస్సు వెంబడి పరుగులు తీయడం, ఎలాగోలా సీట్లు పట్టుకోవడం, అవి రిజర్వేషన్లు అని ఆఖరికి సిబ్బంది చల్లగా చెప్పడంతో మళ్లీ దిగటం యధాకతమైంది. ఒక దశలో ప్రయాణికులు అసహనానికి గురి అయ్యారు. మహిళలు వద్ధులు పిల్లలు ఒకపక్క ఆకలితో అలమటిస్తూనే బస్సులు కోసం పరుగులు తీయడం శోచనీయం. ప్రయాణికుల రద్దీ అధికమవడంతో అక్కడున్న సూపర్వైజర్లు చేతులెత్తేశారు. బ్రహ్మౌత్సవాల్లో భాగమైన గరుడ సేవకే బస్సులు తెప్పించలేక ఇబ్బందులు పడుతుంటే ఈ దసరా సెలవులు బాధ ఏందిరా అంటూ ఉన్నత అధికారులు తలలు పట్టుకోవడం గమనార్హం. దసరా సెలవులు దష్టిలో పెట్టుకున్న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను, అదనపు చార్జీలు లేకుండా నడుపుతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఒక్కరికి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్‌ సర్వీసులను తప్పకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. కానీ తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. బస్టాండ్‌ లో గంటలు తరబడి నిరీక్షించిన ప్రయాణికులు అధిక డబ్బులు ఇచ్చి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి, దసరా సెలవులకు ఇండ్లకు వెళ్లే వారికి, సెలవులు అనంతరం తిరిగి వచ్చే వారికి రవాణా సౌకరం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.