ప్రజాశక్తి - మంత్రాలయం
టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డిని విమర్శించే స్థాయి విశ్వనాథ్ రెడ్డికి లేదని టిడిపి నాయకులు, క్లస్టర్ ఇన్‌ఛార్జీ చిలకలడోన ఎల్లారెడ్డి, చావిడి వెంకటేష్ విమర్శించారు. శుక్రవారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో దీక్ష శిబిరం వద్ద వారు మాట్లాడారు. మండలంలోని రైతుల భూములను మండల అధికారుల సహకారంతో ఆన్‌లైన్‌లో తొలగించి, మళ్లీ మధ్యవర్తిగా రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి విశ్వనాథ్‌రెడ్డి ఆన్‌లైన్‌లో ఎక్కించారని తెలిపారు. ఎమ్మెల్యే విమర్శించినందుకు ప్రతిపక్ష నేతగా తిక్కారెడ్డి స్పందించారని, మధ్యలో విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. నాడు కేశవరెడ్డి పుణ్యాన విశ్వనాథ్‌రెడ్డి తండ్రి సొసైటీ అధ్యక్షులు అయ్యారని, మండల ఇన్‌ఛార్జీగా ఉన్న విశ్వనాథ్‌రెడ్డి వగరూరు గ్రామానికి చేసిందేమి లేదని విమర్శించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి సొమ్ము చేసుకున్న విశ్వనాథ్‌రెడ్డి తిక్కారెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఇప్పటికీ షాపూర్‌లో నకిలీ విత్తనాల కేసు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేతో బంధుత్వం ఉండడంతో ఆయనేదో గొప్పగా ఊహించుకుని, వగరూరులో కర్ణాటక మద్యం అమ్మకాల మామూళ్లు అందుతున్నాయని తెలిపారు. కాలువల శుభ్రం కోసం మండలంలోని రైతుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేశారని, చేపల చెరువుల్లో కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. నాడు ఎల్‌ఎల్‌సి కాలువ ద్వారా నీరు వృథాగా వెళ్తున్నాయని, ఆ నీటిని నిల్వ చేసేందుకు రూ.కోటి విలువ చేసే భూమిని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి రైతుల కోసం తిక్కారెడ్డి ఇచ్చారని చెప్పారు. దీనిపై వైసిపి నేత ప్రదీప్ రెడ్డి ధర్నా చేసి రైతులకు నీరు విడుదల చేయించారని చెప్పారని, అది అవాస్తవమని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. జగనన్న ఇళ్లలో కమీషన్లు తీసుకొని బిల్లులు చేయించిన విషయం తమకు తెలుసన్నారు. వైసిపి అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. అబ్దుల్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు అమర్‌నాథ్ రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు










