ప్రజాశక్తి - కోసిగి
ఓవైపు వరణుడు కరుణించడం లేదని, మరోవైపు విద్యుత్ కోతలు వేధిస్తున్నాయని రైతులు వాపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. విద్యుత్‌ను సక్రమంగా అందించాలని మండలంలోని దొడ్డిబెళగల్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడారు. దొడ్డి బెళగల్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో దొడ్డి బెళగల్, చిన్నబొంపల్లి, చింతకుంట, పల్లెపాడు తదితర గ్రామాల రైతులు బోరుబావుల కింద వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి, మిరప, పత్తి, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారని తెలిపారు. త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కనీసం బోరుబావుల కింద సాగు చేయాలని రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. విద్యుత్ అధికారి వీరేష్‌కు వినతిపత్రం అందజేశారు. సిఐటియు మండల కార్యదర్శి రాముడు, రైతు సంఘం నాయకులు తాయన్న, బాల, హనుమంతు, మహానంది, గడ్డం హనుమంతు, రైతులు తలారి వెంకటేష్, రాఘవేంద్ర, శేషు, వరి నర్సప్ప, కుమ్మరి వీరేష్, దేవన్న పాల్గొన్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులు










