Oct 25,2023 20:56

రద్దీగా ఉన్న రోడ్డు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో రోడ్లు ఇరుకుగా మారడంతో రోజురోజుకు ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య పెరగడంతో దారులన్నీ రద్దీ అవుతున్నాయి. పట్టణంలో మున్సిపల్‌ రోడ్డు, పండిట్‌ నెహ్రూ రోడ్డు, గీతా మార్కెట్‌ ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు వాహనాలు నిలుపుకునేందుకు ఫుట్‌ పాత్‌ సదుపాయం లేదు. జనం రద్దీగా ఉంటున్న ఈ రోడ్లలో రాకపోకలు తలనొప్పిగా ఉందని వాహనదారులు చెబుతున్నారు. శ్రీనివాస భవన్‌, బాబా ప్లాజా, పెద్ద మసీదు, పెద్ద మార్కెట్‌, దాదా కూల్‌డ్రింక్‌ షాపు, జిబి కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో ఎప్పుడూ వాహనాలు అడ్డదిడ్డంగా నిలవడం వల్ల బైకు వెళ్లేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు.
వన్‌ వే మరిచారు: పట్టణంలోని మంగళ క్లాత్‌ స్టోర్‌ నుంచి షరాఫ్‌ బజార్‌ వరకు, శ్రీనివాస భవన్‌ నుంచి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ వరకు గతంలో వన్‌వే అమలులో ఉండేది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలను గాలికి వదిలేయడంతో ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుందని అక్కడి వారు చెబుతున్నారు. బళ్లారి, రాయచూరు, సిరుగుప్ప ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలు శ్రీనివాస భవన్‌ రోడ్డు గుండానే కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంది. భారీ వాహనాలు వచ్చినప్పుడు శ్రీనివాస భవన్‌ రోడ్డు ఇరుకుగా మారి గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోతున్న పరిస్థితి ఉంది. అధికారులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పురవాసులు కోరుతున్నారు.