Oct 14,2023 20:47

సిబ్బందితో మాట్లాడుతున్న డిఐఒ జగన్మోహన్‌రావు

ప్రజాశక్తి - బెలగాం : వ్యాధినిరోధక టీకా నిర్వహణలో నిర్దేశించిన నియమాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహ నరావు సూచించారు. ఈ మేరకు ఆయన 20వ వార్డు (ఎస్‌ఎన్‌పి కాలనీ)లో టీకా కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. సూచించబడిన మార్గదర్శకాలను ఏ మేరకు అమలు చేస్తున్నారో పరిశీలించారు. శనివారం టీకా వేయాల్సిన పిల్లలు, గర్భిణీలు ఎంతమంది, వారి వివరాలు, గడువు తేదీలు, టీకా కేంద్రంలో ఉంచబడిన వ్యాక్సిన్‌ క్యారియర్‌లో ఉన్న వ్యాక్సిన్‌ శీతోష్ణస్థితి, అత్యవసర మందుల కిట్‌ (ఎఇఎఫ్‌ఐ కిట్‌), సిరంజీలు, హబ్‌ కట్టర్‌ పరిశీలించారు. టీకా వేసే ముందు పిల్లలు, గర్భిణుల ఆరోగ్య స్థితి గమనించాలన్నారు. ముందుగా నోటి ద్వారా వేయాల్సిన టీకా తర్వాత ఇంజెక్షన్‌ ద్వారా వేయాల్సిన టీకా వేయాలన్నారు. టీకాలు పూర్తైన తర్వాత వారిని టీకా కేంద్రంలోనే కొద్ది సమయం ఉంచి పర్యవేక్షణ చేయాలన్నారు. వేస్తున్న ప్రతి టీకా ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. వివరాలన్నీ యూవిన్‌, ఆర్‌సిహెచ్‌ పోర్టల్స్‌లో ఆన్లైన్‌ నమోదు చేయాలన్నారు. పట్టణ శివార్లలో తాత్కాలిక జీవనం, వలస జీవనం గడిపే వారిని సందర్శించాలని అక్కడ టీకాలు పొందని పిల్లలు, గర్భిణీలను గుర్తిస్తే వెంటనే టీకాలు వేయాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్స్‌ పుష్ప, జయగౌడ్‌, ఎఎన్‌ఎం సావిత్రి, అంగన్వాడీ సిబ్బంది బి.జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.