పుట్టపర్తి రూరల్: ఉపాధ్యాయుల బదిలీపై షెడ్యూల్ ప్రకటించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి జిల్లా ముఖ్య కార్యదర్శుల సమావేశం పుట్టపర్తి మండల పరిధిలోని బీడుపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని బదిలీలపై షెడ్యూలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ మూడు, నాలుగు, ఐదు తరగతులు ఒక కిలోమీటర్ లోపు పాఠశాలల విలీనం చేసిన ప్రభుత్వం విద్యా ప్రమాణాలను మరచిందని విమర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకపోగా విద్య ప్రమాణాలను దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె. నాగేంద్ర, ఎం. సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి. మారుతి, శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ నాయుడు, డి. శ్రీనివాసులు, నారాయణస్వామి, హెచ్ భాస్కర్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.










