Apr 15,2023 22:47

నిరుపయోగంగా ఉన్న టిడ్కో గృహాలను చూపుతున్న నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌
మండల పరిధిలోని కర్నాటక నాగేపల్లి వద్ద ఏర్పాటుచేసిన టీడ్కో ఇళ్లలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని తెలుగుదేశం పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం టిడ్కో ఇళ్లను పరిశీలించి అభివృద్ధిని సెల్ఫీ ద్వారా పత్రికా విలేకరులకు తెలిపారు. టిడ్కో ఇళ్లు టిడిపి హయాంలో నిర్మించారని, ఈ విషయం అందరికీ తెలుసునని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు వాటిని ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. వాటిపై వైసీపీ ప్రభుత్వం దష్టిపెట్టలేదని ఆయన విమర్శించారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తే, పేరు టీడీపీకి వస్తుందని అదే సమయంలో జగనన్న కాలనీల పేరుతో కొత్తగా స్థలం ఇచ్చి,ఇల్లు కట్టించి ఇస్తే ఆ పేరు జగన్‌ కి వస్తుందని వారి ఆలోచన అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో దాదాపుగా నిర్మాణం పూర్తైన ఇళ్లు,ఇప్పటి వరకూ లబ్ధిదారులకు ఎందుకు అందించలేదనే చర్చ మొదలైందని అన్నారు. ఇప్పటికైనా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి అమ్మినేని కేశవ నాయుడు, ఆరో వార్డు ఇన్‌ఛార్జి బేకరీ నాయుడు, హరి, చెన్నకృష్ణ పాల్గొన్నారు.