ప్రజాశక్తి - ఆదోని
లబ్ధిదారులు సత్వరమే టిడ్కో ఇళ్లల్లో చేరితే అన్ని సదుపాయాలూ కల్పిస్తామని, లేకపోతే పరిస్థితి మొదటికే వస్తుందని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి సూచించారు. పట్టణంలోని శివారు ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అక్కడికొచ్చిన లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. తాగునీటి వసతి, విద్యుత్, రోడ్డు వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. టిడ్కో ఇళ్లపై అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. లబ్ధిదారులు త్వరగా చేరితే మరిన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. 2 వేల మందికి ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిందని, వారు చేరేందుకు ముందుకు వస్తే తాళాలు అప్పగిస్తామని చెప్పారు. గృహ సముదాయం ఉండడం వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలో ఇండివిజువల్ హౌసెస్ నిర్మిస్తున్నారని తెలిపారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాంతంలో పేదలకు సెంటున్నర స్థలం కేటాయించామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ స్థలంలోనే టిడ్కో గృహాలు నిర్మించి కొందరు లబ్ధిదారులకు నష్టం చేకూర్చారన్నారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వైస్ ఛైర్మన్లు కామాక్షి తిమ్మప్ప, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు ఇంతియాజ్, వసీం, నాయకులు దేవా, బికె.లక్ష్మన్న, బిటి.లక్ష్మన్న, నగరూరు చంద్రశేఖర్ రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, చిన్న ఈరన్న, చంద్ర, నాగ కల్పవళ్లి పాల్గొన్నారు.
స్కిల్ హబ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ స్కిల్ హబ్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సూచించారు. పట్టణంలోని బాలుర హాస్టల్‌లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఎమ్మెల్సీ మధుసూదన్‌తో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకుంటే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... నిర్దిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణ, అంకిత భావాన్ని విద్యార్థి దశ నుంచే అలవర్చుకుంటే జీవితంలో త్వరగా స్థిరపడతారని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ శాంత, కౌన్సిలర్లు చిన్న, రామలింగేశ్వర యాదవ్, జిల్లా డాక్టర్ల సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, మాజీ మండల అధ్యక్షులు పంపాపతి, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, సురేష్ పాల్గొన్నారు.










