Aug 04,2023 19:14

జెండా ఊపి వాహనాన్ని ప్రారంభిస్తున్న ఉమాపతి నాయుడు

ప్రజాశక్తి - ఆదోని
వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని టిడిపి కార్యాలయం ముందు 'భవిష్యత్తు గ్యారెంటీ' ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మండలంలోని పెద్దతుంబలం గ్రామంలో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ మహిళ నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడారు. సంక్షేమమంటూ అభివృద్ధిని విస్మరించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని వైసిపి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిందంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం ఖాయమన్నారు. 20 ఏళ్ల క్రితమే డ్వాక్రా మహిళలకు ఎన్నో ఆర్థిక ప్రయోజిత పథకాలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మహిళలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, తల్లిదీవెన కింద రూ.15 వేలు, ఇంట్లోని మహిళలందరికీ నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. టిడిపి పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళాల్సిన ఆవశ్యకత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు రూపొందించిన మేనిఫెస్టోను గ్రామ వార్డుల్లో జనాలకు వివరించి ప్రచారం కల్పించాలని కోరారు. నాయకులు రామస్వామి, తిమ్మప్ప, రామకృష్ణ, బసవరాజు, మాబాష, విశ్వనాథ్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ ఆచారి, బాలాజీ, మహిళలు శాంతి, రాజేశ్వరి, నూర్జహాన్‌, సాధిక బేగం, శ్రీదేవి, కుమారి పాల్గొన్నారు.