Jul 23,2023 22:26

మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని అందజేస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

ప్రజాశక్తి-కనగానపల్లి :మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే ఒక్క టిడిపితోనే సాధ్యమని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాశక్తి చైతన్యయాత్ర ఆదివారం మండల పరిధిలోని ముత్తవకుంట్ల నుంచి ప్రారంభమైంది. ముందుగా రామగిరి మండలంలోని వెంకటాపురంలో మహిళా శక్తి చైతన్య రథానికి సునీత మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు చేసి టిడిపి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పరిటాల ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ముత్తవకుంట్ల గ్రామానికి చేరుకొని యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతకు గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇంటింటికీ వెళ్లి మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను గుర్తించి చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పథకాలు రూపొందించారన్నారు. రాప్తాడు నియోజక వర్గంలో అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. టిడిపి అధికారంలోకి రాగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూస్తారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్‌, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు సుబ్బ రత్నమ్మ, గాండ్ల సాధికార సమితి అధ్యక్షురాలు విశాలాక్షి, హిందూపురం పార్లమెంట్‌ మహిళా ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, మహిళా నాయకురాళ్లు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.