Apr 17,2023 22:05

సమావేశంలో మాట్లాడుతున్న గుండుమల

ప్రజాశక్తి - మడకశర : 2024 లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ పార్టీ పరిశీలకులు పార్థసారథి రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు . సోమవారం పట్టణంలోని యాదవ భవనంలో నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ అబ్జర్వర్‌ పార్థసారధి రెడ్డి హాజరయ్యారు. సమావేశం నిర్వహణకు మునుపు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి అధిష్టానం పంపిన నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ నియామక పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024లో జరగబోవు ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీకి వెన్ను దన్నుగా నిలిచి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి వ్యవహరించే వ్యక్తుల పట్ల అధిష్టానం తీసుకుపోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్న నిలబెట్టుకుంటానని అన్నారు. పార్టీకి అహర్నిశలు శ్రమించి కష్టపడ్డవారందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ, ఐదు మండలాల కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు మనోహర్‌, లక్ష్మీనారాయణ, కుమారస్వామి, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు భక్తర్‌ , తెలుగు యువత నాయకుడు తిమ్మరాజు, ఎసి సెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు ,