ప్రజాశక్తి-పాలకొండ/పాలకొండ రూరల్ : తెలుగుదేశం పార్టీ పాలకొండ ఎస్‌టి నియోజకవర్గం టిక్కెట్ కోసం ఇప్పటికే అనేక మంది ఆశావాహులు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణతో పాటు పడాల భూదేవి, గేదెల రవి, నిమ్మక స్వాతి పేర్లు కొద్ది రోజుల వరకు వినిపించాయి. అయితే గత వారం రోజుల నుంచి మరో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. కొత్తూరు మండలం ఆమె సొంత ప్రాంతం కావడం, రాజాంలో స్థిరనివాసంగా ఉన్న తేజావతి పేరు తెరపైకి వచ్చింది. ఈమె వంగర మండలం అరసాడ ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ఈమె భర్త బొబ్బిలి విద్యుత్ శాఖ కార్యాలయంలో జెఇఒగా పనిచేస్తున్నారు. అయితే భామిని, వీరఘట్టం మండలాల్లో ఈమె భర్తకు మద్ధతు ఉండడంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు మద్ధతుతో ఈమె టిక్కెట్ కోసం పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. రాజాంలో స్థిరనివాసంగా ఉండడంతో ఈ ప్రాంత టిడిపికి చెందిన ముఖ్యనేత కిమిడి కళావెంకటరావు ఆశీస్సులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవలే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెంనాయుడును కలిసి మద్ధతు కోరినట్టు సమాచారం. ఆయితే ఇద్దరు నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మరోపక్క బొబ్బిలి ప్రాంతానికి చెందిన బేబినాయన కూడా వీరితో మంచి సత్సంబంధాలున్నట్టు సమాచారం. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయకృష్ణకు టిక్కెట్ ఇవ్వొద్దని ఇప్పటికే ఒకవర్గం బలంగా వాదన వినిపిస్తున్నారు. అయితే ఏకపక్ష నిర్ణయంతో తమకు ఇవ్వాలని ఆమె కళావెంకటరావును కోరినట్టు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని చెప్పాల్సి వచ్చేటప్పుడు ఇన్‌ఛార్జి టిక్కెట్ మార్చితే కచ్చితంగా అధినేత దృష్టికి తీసుకువెళ్తానని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా పార్టీలో ఆశావాహులు ఎక్కువ అవ్వడంతో పార్టీలో ఉన్న క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. పార్టీ నాయకత్వం దీనిపై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారు.










