ప్రజాశక్తి -పెనుకొండ : టిడిపి వాళ్లది పైశాచిక ఆనందమని వైసిపి జిల్లా అధ్యక్షులు పెనుకొండ ఎమ్మెల్యే మాలకొండ శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ను చూసి టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సెల్ఫీ ఛాలెంజ్ లు చేస్తున్నారని తెలిపారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బి.కే. పార్థసారథి కియా వద్ద సెల్ఫీ తీసుకోవడం జరిగిందని అయితే కియా పరిశ్రమ తీసుకువచ్చినది నరేంద్ర మోడీ అని అది ఇంటర్నేషనల్ కంపెనీ అని ఆ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఎక్స్పోర్ట్స్ అనుకూలంగా జాతీయ రహదారి రైల్వే లైన్ ఉండడంతో పెనుకొండకు కియా పరిశ్రమ వచ్చిందని అన్నారు. చంద్రబాబును చూసి కియా పరిశ్రమ ఇక్కడ కు రాలేదన్నారు. ఎకరా భూమిని చదును చేయడానికి ఖర్చు చేసిన రూ 30 లక్షలలో చంద్రబాబుకు లోకేష్ కు బి.కె పార్థసారధికి వచ్చిన వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. టిడిపి నాయకురాలు సవితమ్మ గొల్లపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకొందని గొల్లపల్లి రిజర్వాయర్ ను ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. రూ. 5400 కోట్ల రూపాయల నిధులు హంద్రీనీవా కోసం ఖర్చు చేశారని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు 9 ఏళ్లలో రూ. 9 కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు పరిటాల సునీతమ్మ, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నారని వారు గ ఐదేళ్లలో వారి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ నరసింహ, ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు కష్ణారెడ్డి,నగర పంచాయతీ చైర్ పర్సన్ ఫరూక్, వైస్ చైర్ పర్సన్ సునీల్, శ్రీకాంత్ రెడ్డి, వెంకటరామి రెడ్డి,సోమందేపల్లి ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం,మండల కన్వీనర్ నారాయణరెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, కొండలరాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










