Sep 24,2023 21:31

టిడిపి శ్రేణుల్లో కొరవడిన ఉత్తేజం

ప్రజాశక్తి - సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశంలో శ్మశాన వైరాగ్యం ఆవహించినట్లు కనిపిస్తోంది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం, జైలు పాలై పదిరోజులు దాటినా బెయిల్‌ రాకపోవడంతో స్థానిక నాయకులు, కేడర్‌లో కొంత నైరాశ్యం ఏర్పడింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల నాటికి పార్టీ కొంత పుంజుకుంటుందని భావించినా ప్రతికూల పరిస్థితుల కారణంగా సంక్షోభం వెంటాడుతోంది. జిల్లాకు సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కొరవడింది. రాష్ట్ర వ్యాప్తంగా పీడిస్తున్న ఆగష్టు సంక్షోభం తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వైపు సంక్షోభం తరుముకొస్తున్నా నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల మధ్య ఐక్యతా రాగం కనిపించడం లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ప్రధానంగా వరుసగా మూడు సార్లు ఓటమి పాలైన సాలూరు నియోజకవర్గంలో పార్టీకి బలమైన కేడర్‌ ఉన్నట్లు కనిపిస్తున్నా నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నియోజకవర్గ ఇంఛార్జి, పొలిట్‌ బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ గ్రూపుల మధ్య సమన్వయం ఇప్పటికీ ఎండమావి గానే ఉంది. కొద్దినెలల క్రితం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేసిన అంశాలేవీ అమలుకు నోచుకోలేదు. నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, నెలకోసారి సమావేశం నిర్వహించాలని, కార్యాలయం ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణినిఆదేశించారు. ఇది జరిగి రెండు నెలలు కావస్తున్నా ఆచరణకు నోచుకోలేదు. పార్టీ సంక్షోభ పరిస్థితుల్లో వున్నా నాయకుల మధ్య ఐక్యతా రాగం కనిపించకపోవడంతో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం క్షీణిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జరుగుతున్న ధర్నా, ఆందోళన కార్యక్రమాల్లోనూ గ్రూపు రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాయకులు ఎవరికి వారే నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో సమన్వయం కనుచూపు మేరలో కనిపించడం లేదు. సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగను ఎదుర్కొంటున్న పొలిట్‌ బ్యూరో సభ్యులు సంధ్యారాణి మన్యం జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ జిల్లా నాయకత్వం సమర్ధవంతంగా నిర్వహించలేక, సొంత ఇంట్లో అసమ్మతి సెగను చల్లార్చ లేని పరిస్థితుల్లో సంధ్యారాణి ఉన్నారు. ఇక పార్వతీపురం నియోజకవర్గం టిడిపిలో గ్రూపు రాజకీయాలు పైకి కనిపించకపోయినా నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవిని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడంతో గ్రూపు రాజకీయాలకు బీజం పడింది. గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ కూడా నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకుల అరాచకాలను ఎండగట్టడంలో విఫలమవుతున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా యువ నాయకుడు విజయచంద్రకి అప్పగించారు. దీంతో కొంత ఊపు వస్తుందని ఆశతో పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక కురుపాంలోనూ గ్రూపు రాజకీయాలు బుసకొడుతూ ఉన్నాయి. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, సీనియర్‌ నాయకులు దత్తి లక్ష్మణరావు మధ్య నివురుగప్పిన నిప్పులా గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరికి నియోజకవర్గ నాయకుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం లేదు. అధికారపార్టీపై నెలకొన్న వ్యతిరేకతని సొమ్ము చేసుకోవడంలో టిడిపి నియోజకవర్గ నాయకులు విఫలమవుతున్నారు. పాలకొండ నియోజకవర్గంలోనూ టిడిపికి ఎదురీదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఇద్దరు నాయకులు టికెట్‌ ఆశిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా యువ నాయకుడు జయకృష్ణ ఉన్నా కేడర్‌లో ఉత్తేజం కొరవడుతోంది. నియోజకవర్గంలో వైసిపి నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలను సొమ్ము చేసుకునే అవకాశం ఉన్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో మన్యం జిల్లాలో టిడిపి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునే పరిస్థితి ఏర్పడింది .