కనగానపల్లి : టిడిపి బస్సు యాత్ర మొదలు కాగానే వైసిపి నాయకుల్లో వణుకు పుట్టిందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. రామగిరి మండల పరిధిలోని వెంకటాపురంలో శనివారం ఆమె తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బస్సు యాత్ర ఈ నెల 26వ తేదీ రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఒక రోజు జరిగే బస్సుయాత్రలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలు, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి, మేనిఫెస్టో గురించి వివరిస్తామని తెలిపారు. నాలుగేళ్లలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఎంతో వెనుకబడిందని విమర్శించారు. ఇది ప్రజల కోసం చేస్తున్న యాత్ర అని ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్, కన్వీనర్లు యాతం పోతలయ్య, సుధాకర్, సీనియర్ నాయకులు సుధాకర్ చౌదరి, బాల నరసింహులు, పూజారి రాజకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.










