అనంతపురం ప్రతినిధి : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా తెలుసుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన బంద్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాక్షికంగా జరిగింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు యథావిధిగా నడిచాయి. ఆర్టీసీ సబస్సులను అడ్డుకునేందుకు ఉదయమే తెలుగుదేశం, జనసేన నాయకులు ప్రయత్నం చేసిన్పటికీ పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. దీంతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య నాయకులపై నిఘా పెట్టారు. వారిని ఉదయం నుంచే గృహ నిర్బంధం చేశారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రం ఉదయం నుంచే వీధుల్లోకి వచ్చారు. ప్రధాన కూడళ్లలో నిరసనలు సైతం చేపట్టారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. కదిరిలో ఆర్టీసి బస్సును అడ్డుకునే క్రమంలో ఒక బస్సు అద్దం పగిలింది. తక్కిన చోట పోలీసులు, నాయకుల మధ్య వాగ్వివాదాలతోనే నడిచింది.
పెద్దఎత్తున కొనసాగిన అరెస్టులు
బంద్ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన నాయకులను పెద్దఎత్తున అరెస్టులు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది వరకు అరెస్టు అయ్యి ఉంటారన్నది అంచనా. అన్ని ప్రధాన కేంద్రాలతోపాటు, మండల కేంద్రాల్లోనూ నిరసనలు జరిగాయి. పెనుకొండ వద్ద జాతీయ రహదారి 44పై టిడిపి నాయకులు నిరసనలు చేపట్టారు. తనకల్లులో వైఎస్.జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతపురం నగరంలో ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సులను అడ్డుకునేందుక టిడిపి, జనసేన నాయకులు ప్రయత్నించారు. వారిని అరెస్టు చేసి అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బుక్కరాయసముద్రం వద్ద పెద్దఎత్తున టిడిపి నాయకులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మాజీ మంత్రి పరిటాల సునీతను వెంకటాపురంలో గృహ నిర్బంధం చేయగా తప్పించుకుని బంద్‌లో పాల్గొనేందుకు వెలుతుండగా నసనకోట వద్ద అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పరిటాల శ్రీరామ్ కూడా ఇంటి గోడదూకి వెనుకవైపు నుంచి పోలీసు నిర్బంధం నుంచి తప్పించుకుని నిరసనలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో గాండ్లపెంట వద్ద నిరసనలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ కందికుంట వెంకటప్రసాద్, పెనుకొండలో బికె.పార్థసారధి, సవితమ్మలను అరెస్టు చేశారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ ఈరన్నలను గృహ నిర్బంధం చేశారు. అనంతపురం జిల్లాలోనూ ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
బంద్‌ను ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించిన డిఐజి అమ్మిరెడ్డి
తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ఘటనలూ చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. బంద్ జరుగుతున్న తీరును డిఐజి అమ్మిరెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతపురం నగరంలో ఆయన పర్యటించారు. బంద్ ప్రభావం పెద్దగా లేదని, అన్ని సవ్యంగా నడుస్తున్నట్టు ఆయన టవర్‌క్లాక్ సమీపంలో కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో సజావుగా జరిగినట్టు తెలిపారు.










