May 19,2023 21:58

తహశీల్దార్‌ కార్యాలయం ముందు రైతుల నిరసన

ప్రజాశక్తి బత్తలపల్లి : మండలంలోని దంపెట్ల- ఉప్పర్లపల్లి సమీపాన చిత్రావతి నదిలో నూతనంగా అనుమతులిచ్చిన ఇసుక రీచ్‌ను రద్దు చేయాలంటూ మండలంలోని పలు గ్రామాల రైతులు డిమాండ్‌ చేశారు. దంపెట్ల సర్పంచి చల్లా కరుణాకర్‌ నాయుడు, సిపిఐ రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కమతం కాటమయ్య ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతాలైన ఉప్పర్లపల్లి, దంపెట్ల గ్రామాలకు చెందిన రైతులు సమస్యను శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ యుగేశ్వరిదేవి దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చారు. అయితే తహశీల్దార్‌ కలెక్టరేట్లో సమావేశానికి వెళ్లినట్లు తెలుసుకున్న సర్పంచు, రైతు సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆధ్వర్యంలో కార్యాలయం మెట్లపై కూర్చుని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో వందలాదిమంది ఫిల్టర్‌ బావులతో వ్యవసాయాన్ని సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. ప్రభుత్వం ఇసుకరీచులకు అనుమతులు ఇవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచి చల్లా కరుణాకర్‌ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం దంపెట్ల వద్ద ఇసుక రీచ్‌కు ప్రతిపాదనలు మాత్రమే చేసిందని అనుమతులు కూడా రాకమునుపే టిప్పర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, కనీసం పంచాయతీ అనుమతులు కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం రెవిన్యూ అధికారులకు కూడా తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తహశీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో సిఎస్‌డిటి శారదకు రైతులు వినతిపత్రం అందజేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు యుగేశ్వరిదేవి సర్పంచితోనూ, రెవెన్యూ సిబ్బందితోను మాట్లాడి ఇసుక రీచ్‌ ను నిలుపుదల చేయాలంటూ వీఆర్వో నరసింహులు, విఆర్‌ఎను ఆదేశించారు. రైతులు ఈసందర్భంగా అధికారులతో కలసివెల్లి ఇసుక రీచ్‌ వద్ద టిప్పర్లను అడ్డుకున్నారు.