మహిళా పోలీసులకు ప్రశంసాపత్రం అందజేస్తున్న డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
తగ్గిన నేరాలు
- పోలీసుల లెక్కల్లో దేనిలోనూ కనిపించని పెరుగుదల
- వివరాలు వెల్లడించిన డిజిపి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
నంద్యాల జిల్లా వ్యాప్తంగా గత మూడేళ్లలో జనవరి నుంచి మే వరకూ పోల్చుకుంటే ఈ ఏడాది నేరాలు తగ్గాయి. పోలీసుల లెక్కల ప్రకారం ఏ ఒక్క గణాంకాల్లోనూ పెరుగుదల కనిపించలేదు. నేర సమీక్షా సమావేశం సందర్భంగా డిజిపి కెవి.రాజేంద్రనాథ్‌రెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న నేరాల వివరాలను మీడియాకు విడుదల చేశారు. 2020 జనవరి నుంచి మే వరకూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,896 కేసులు నమోదు కాగా 2021లో 4,224 కేసులు, 2022లో 3,084 కేసులు నమోదు కాగా ఈ ఏడాది కేవలం 1,942 కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2020లో హత్యలు 13 చోటు చేసుకోగా 2021లో 28 హత్యలు, 2022లో 19 హత్యలు జరిగాయి. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 16కు తగ్గింది. వరకట్నం కోసం 2020లో 2 హత్యలు, 2021లో 1 హత్య, 2022లో 2 హత్యలు జరగ్గా ఈ ఏడాది ఆ సంఖ్య 2కు పరిమితం అయింది. హత్యాయత్నాలకు సంబంధించి 2020లో 33 కేసులు, 2021లో 33 కేసులు, 2022లో 45 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 18కి తగ్గింది. సాధారణ దొంగతనాలకు సంబంధించి 2020లో 46 కేసులు, 2021లో 54 కేసులు, 2022లో 131 కేసులు నమోదుకాగా ఈ ఏడాది ఆ సంఖ్య 100కు పరిమితం అయింది. రాత్రిపూట ఇళ్లను దోచుకోవడానికి సంబంధించి 2020లో 20 కేసులు, 2021లో 28 కేసులు, 2022లో 32 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 30కు తగ్గింది. అత్యాచార కేసులకు సంబంధించి 2020లో 2 కేసులు, 2021లో 2 కేసులు, 2022లో 6 కేసులు నమోదుకాగా ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కానట్లు లెక్కల్లో పేర్కొన్నారు. మహిళలపై ఇతర నేరాలకు సంబంధించి 2020లో 83 కేసులు, 2021లో 109 కేసులు, 2022లో 157 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 109కి తగ్గింది. పోక్సో కేసుల్లో 3, 4, 5, 6 సెక్షన్లకు సంబంధించి 2020లో 4 కేసులు, 2021లో 9 కేసులు, 2022లో 19 కేసులు నమోదుకాగా ఈ ఏడాది కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి 2020లో 31 కేసులు, 2021లో 42 కేసులు, 2022లో 41 కేసులు నమోదుకాగా ఈ ఏడాది 31 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్‌కు సంబంధించి 2020లో 2 కేసులు, 2021లో 9 కేసులు, 2022లో 20 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 6కు తగ్గింది.
మరికొన్ని నేరాలు ఇలా...
నేరం 2020 2021 2022 2023
చీటింగ్ 73 85 242 148
సైబర్ నేరాలు 29 13 16 14
రోడ్డు ప్రమాదాలు 92 112 137 126
లిక్కర్ కేసులు 665 363 831 212
జిల్లాలో మొత్తం కేసులు
2020 5,896
2021 4,224
2022 3,084
2023 1,942
3 నెలల్లో ట్రయల్స్ పూర్తి
- 66 శాతం కేసుల్లో శిక్షలు
- డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
అన్ని కేసుల్లో మూడు నెలల్లోపు ట్రయల్స్ పూర్తి అవుతున్నాయని, 66 శాతం కేసుల్లో శిక్షలు పడుతున్నాయని డిజిపి కెవి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేర సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిజిపి మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేరాలపై సమీక్ష చేశామని, నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనాలు తగ్గాయన్నారు. కర్నూలు జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు అదే విధంగా ఉన్నాయని, నంద్యాల జిల్లాలో తగ్గుముఖం పట్టాయని తెలిపారు. దిశ యాప్ విశేషంగా వాడటం, కేసులను సీరియస్‌గా తీసుకోవడంతో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. గ్రామ, వార్డు మహిళా పోలీసుల సేవలను వీలైనంత మేరకు వినియోగించుకోవాలని అనుకున్నామన్నారు. మహిళా పోలీసుల వల్ల గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించగలుగుతున్నామని, మిస్సింగ్ కేసులను ఛేదిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు ఎక్కడా పెరగలేదని, తమ దగ్గర రికార్డ్ ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు డిజిపి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయనడం సరికాదని, తమ దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పారు. ప్రతి సంవత్సరం సంఖ్య తగ్గుతూ ఉందన్నారు. ఆరోపణలు చేసే వారికి ఆధారాలతో సహా సమాధానం ఇస్తామన్నారు. అనంతరం పలు కార్యక్రమాలను విజయవంతం చేసిన మహిళా పోలీసులకు ప్రశంశాపత్రాలు, నగదు బహుమతులను అందజేశారు. సమావేశంలో కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్, కర్నూలు ఎస్‌పి కృష్ణకాంత్, నంద్యాల ఎస్‌పి రఘువీర్‌రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.










